నేను మరల నీకు నమస్కరించుచున్నవాడనై విన్నవించుకొనుచున్నాను. “శ్రీ రామచంద్రుడు ధర్మాత్ముడు, సత్యపరాక్రముడు. నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తుగాని, మహాపాశ్వమహోదరకుంభ నికుంభాతి కాయాది రాక్షసవీరులైన గాని, తుదకు నీవైనకాని సమరాంగణములో శ్రీరామచంద్రుని ఎదుట ఒక్క క్షణమైనను నిలువజాలరు; కావున ఆయనతో శత్రుత్వము వహించుట నీకు ఉచితము కాదు. అమోఘములు, అప్రతిహతములైన ఆ కోసలేంద్రుని శరములను స్మరించి జనక రాజకుమారియైన సీతను ఆయనకు సమర్పించి క్షమింపుమని ప్రార్థించుటలో నీకు శుభము కల్గును.
విభీషణుడు పల్కిన హితవచనముల ఆలకింపగానే రావణుడు మిగుల కోపించెను. క్రోధముతో కంపించుచు ఇట్లు పలికెను. “అసురకులమునకు కళంకమైనవాడా! నేను అనుగ్రహించిన భోగ భాగ్యములచే శరీరమును బాగుగా పెంచిన వాడవైన నీవు నేడు నా ఎదుటనే శత్రువులను పొగడుచుంటివి. శత్రువుల ఎదుటనే అవమానము చెందుచుండగా చూడవలెనని నీవు ఆకాంక్షించుచున్నావు కాబోలు. అది అసంభవము. నా భయము వలన ముల్లోకములు కంపించును. కాని నీవు నన్నొక సామాన్యమానవుని ఎదుట భయపెట్టుటకు ప్రయత్నించుచున్నావు. ధిక్కారము, ధిక్కారము! నీవు దప్ప అన్యులెవ్వరైనను ఇట్లు పలికినచో వెంటనే అసువులు బాసియుండెడివారు”.
కోపోద్దీపిత మానసుడై రావణుడు విభీషణుని కాలితో తన్ని ‘ధూర్తుడా! పొమ్ము! ఆ వనవాసియైన మానవునితో చేతులుగలుపు'మని తిరస్కారముగా పలికెను.
దశకంఠుడు పల్కిన కటు వచనములను ఆలకించి వాని పాదప్రహారమును సహితము సహించి బుద్ధిమంతుడు, మహా బలవంతుడునైన విభీషణుడు అగ్రజుని చరణములకు నమస్కరించి, తన నలుగురు మంత్రులను తోడ్కొని, గదాధారియై ఆకాశమునకు ఎగిసినవాడై రావణునితో ఇట్లు పల్కెను.
No comments:
Post a Comment