Saturday, 8 January 2022

శ్రీ హనుమద్భాగవతము (125)



సముద్రమధ్యమున నున్న పర్వతరాజగు సునాభుని (అనగా మైనాకుని) స్పృశించినవాడై అత్యంత వేగశాలియైన పవనకుమారుడు ధనుస్సు నుండి వదలిన బాణమువలె సముద్రమునకు ఆవలనున్న తటమును చేరెను. మహేంద్ర పర్వతమును గాంచగానే శ్రీ ఆంజనేయుడు గంభీరమైన స్వరముతో అనేక పర్యాయములు గర్జించెను.


సముద్రమున కావలి ఒడ్డునకు చేరుట


లంకాదాహకుడైన శ్రీకపీశ్వరుని సింహనాదమును ఆలకించి సముద్రమునకు ఆవలి తటమునందున్న కోటాను కోట్ల వానర భల్లూక వీరులు సంతోషముతో కిలకిలారవముల నొనరించుచు, ఎగురుచు నృత్యమొనరించిరి. శ్రీ హనుమంతుడు సీతా దేవిని దర్శించి తిరిగి వచ్చుచున్నాడని వారికి విశ్వాసము కలిగింది. శూరులు, వీరులు, మహాబలవంతులైన వానర భల్లూకములు ఉత్తరతటముపై నిలువబడి కందర్ప కోటి లావణ్యసుందరాకారుడైన శ్రీరామదూతయైన శ్రీ ఆంజనేయుని రాకకై కండ్లు తెరచుకొని నిరీక్షింపసాగారు. కపి శ్రేష్ఠుడు, శ్రీమారుతాత్మజుడైన శ్రీ ఆంజనేయుని సింహ నాదమును గుర్తించినవారై ఆయనను దర్శింపవలెనని ఆ వానర భల్లూక వీరులు గిరుల నెక్కిరి; కొందఱు ఆకాశమునకు ఎగిరారు. అదే సమయమందు వేగవంతుడు, బృహత్కాయుడైన ఆంజనేయుడు మహేంద్రగిరి శిఖరముపై దిగాడు. 


గోద్విజులకు హితమును ఒనరించువాడు, పరమప్రభువు, పాపతాపములను నివారించువాడైన భగవంతుడు ధర్మ సంస్థాపనార్థము ధర్మాభ్యుదయముకొఱకు ప్రతియుగము నందు అవతరించును. మధురములు, శుభప్రదములైన ఆ ప్రభుని లీలలు పరమాశ్చర్యకరములు. తన నుండి దూరముగా పోయిన జీవులను తన చెంతకు చేర్చుకొనుటకై భగవంతుడిట్టి అద్భుత లీలలను ఒనరించును. ఆనంద రామాయణములో ఒక కల్పములో భగవానుడైన శ్రీరామచంద్రుని అవతారలీలలు వర్ణింపబడెను. ఆ రామాయణ మందు పవన కుమారుని అద్భుత పావనకథ కలదు. అది సంక్షేపముగా ఇట్లున్నది.


No comments:

Post a Comment