Friday, 14 January 2022

శ్రీ హనుమద్భాగవతము (131)



దధిముఖుడు మొదలగు వనరక్షకులు ఆ మహావీరులను అడ్డగించారు. యువరాజైన అంగదుని యొక్క శ్రీరామభక్తుడైన ఆంజనేయుని యొక్క అండ చూచుకొని మధువును త్రాగి మత్తులైన ఆ వానర వీరులు వనరక్షకులను తిరస్కరించి వారిని మోద ఆరంభించారు.


వివశుడైన దధిముఖుడు వానరేశ్వరుడైన సుగ్రీవుని చెంతకు చేరి ఇట్లు నివేదించాడు. రాజా ! నీవుచిరకాలము నుండి రక్షించుకొనుచున్న సుందరమైన మధువనమును హనుమద అంగదాదుల ప్రోద్బలముచే వానరులు నష్టం మొనరించారు. అంతేగాక వారు వనరక్షకులమైన మమ్ము కొట్టిరి. 



సుగ్రీవుని ఆనందమునకు అంతు లేకపోయెను. దధిముఖునితో ఇట్లు పలికెను. “మామా! నిశ్చయముగా శ్రీ ఆంజనేయుడు జానకిని దర్శించియే యుండును, లేనిచో మధు వనమును సమీపించు సాహసము వారికెక్కడిది? యువరాజు అట్టి అనుజ్ఞని ఇవ్వజాలడు. నీవు వారిని క్షమింపుము.”


అప్పుడు భగవానుడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో "రాజా! నీవు సీతాసంబంధమైన మాటలేల పలుకుచున్నా”వని అనెను. అందులకు సుగ్రీవుడు వినయ పూర్వకముగా ప్రభూ! శ్రీహనుమంతుడు సీతను దర్శించినట్లుగా తోచుచున్నది. లేనిచో మధువనమున ప్రవేశించి దానిని నష్ట మొనరించుటకు వానరులు సాహసింపజాలరు” అని విన్నవించెను. ఈ శుభ సమాచారముచే శ్రీరామచంద్రుని హృదయం ఆనందముతో ఉప్పొంగెను, సుగ్రీవుడు దధిముఖుని “మామా! నీవు తక్షణమే వెళ్ళి ఆ వానరశ్రేష్ఠులను సీతా దేవి యొక్క శుభ సమాచారమును ప్రభువునకు యథాశీఘ్రముగా విన్నవించుటకు రావలసినదిగా తెలుపు"మని ఆజ్ఞాపించెను. దధిముఖుడు "వెడలి పోయెను.


No comments:

Post a Comment