లంకాయాత్రను గూర్చి వివరించుట
త్రైలోక్యమోహనమైన శ్రీరామచంద్రుని ముఖారవిందమును అవలోకించుచు వినీతాత్ముడైన పవనకుమారుడు చేతులు జోడించి ఇట్లు పలికెను. “ప్రభూ! నేను పశుసమానుడను, అంతియేకాదు చంచలుడైన తుచ్ఛవానరుడను. నా విద్య, బుద్ధి, శక్త్యాదులేపాటివి? కాని నీ అనుగ్రహముచే దూది యైనా బడబాగ్నిని సహితము చల్లార్పగలదు. నీ ఆదేశానుసారముగా కిష్కింధాధిపతి ఇచ్చిన ఆజ్ఞను శిరసా వహించి సీతాదేవిని వెదకుటకు బయలు దేరితిని. అందఱు చూచుచుండగానే గగనమార్గమునకు ఎగిరి విశాలమైన సాగరమును దాటి లంకానగరము చేరితిని. రాక్షసుల దృక్కుల నుండి తప్పుకొనుటకు సూక్ష్మశరీరమును ధరించిన వాడనై సీతామాతను దశకంఠునకు ప్రియమైన అశోకవనములో అశోవృక్షము క్రింద శోకమగ్నురాలైయున్న తల్లిని దర్శించి విగత ధైర్యుడనైతిని. నేను వృక్షముపై కొమ్మలలో దాగి యుండగా క్రూరుడైన రావణుడు ఆ ప్రదేశమునకు వచ్చాడు. వియోగినియైన సీతా దేవిని వశపరచుకొనుటకు అతడు అనేక విధముల ఆమెను భయపెట్టెను, బెదిరించెను. కాని ఆమె వానిని ఒక కుక్కగా తలంచి నిరసించెను. అపుడా అధముడైన రాక్షసుడు ఆమెను చంపుటకు ఉద్యుక్తుడయ్యెను. పట్టపురాణియైన మండోదరి వానిని శాంతింపజేయగా ఒక మాసము గడువును విధించి అతడు వెడలిపోయెను. కాపుగా నున్న రాక్షస స్త్రీలు కూడా జనక రాజకుమారిని అనేక విధముల భయపెట్టిరి. వారందఱు వెడలిన పిమ్మట సీతా దేవి అసహ్యమైన వియోగ దుఃఖమును భరింపలేక ప్రాణములను త్యజించుట కుద్యుక్తురాలయ్యెను.
ఆసమయమున నేను వృక్షముపై కొమ్మలలో దాగిన వాడనై నీ పావన చరితమును గానం ఒనరింపసాగితిని. నీ పుట్టుక మొదలుకొని దండ కారణ్యమునకు వెడలుట, సీతాపహరణము, సుగ్రీవునితో స్నేహము, వాలిని వధించుట, కిష్కింధాధిపతియైన సుగ్రీవుడు ఆమెను వెదకుటకు వానరులను నలుదిశలకు పంపుట, నేను కూడ శ్రీరామ కార్యార్థమై వెడలుట మొదలగు సంఘటనలను అన్నింటిని వర్ణించినవాడనై ' అమ్మా! నీదర్శనమును పొంది కృతారుడనైతినీ అని అంటిని.
No comments:
Post a Comment