Tuesday 4 January 2022

శ్రీ హనుమద్భాగవతము (122)



రచన - శ్రీ మట్టుపల్లి శివ సుబ్బరాయ గుప్త

వైదేహి నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించాయి. ఆమె ఎంతో బాధతో ఇట్లు పల్కెను. “కుమారా! నీ ఆగమనముచే నాకొకింత ఆధారము దొరికింది. నీవు కూడా ప్రయాణమగుచున్నావు. నీవు మరలిపోయిన పిమ్మట నాకిక ఆ దుఃఖపు దినములు, రాత్రులు సంప్రాప్తించును. వత్సా! నీవు ఒకింత డస్సినచో ఈ ప్రదేశమందు ఏదో ఒక స్థావరమందు దాగి విశ్రాంతి తీసుకో. నేడు విశ్రమించి రేపు పొమ్ము”.


అత్యంత శ్రద్ధాభక్తులతో పవనాత్మజుడిట్లు నివేదించెను. తల్లీ ! ప్రభువు కార్యము పరిపూర్ణము కాకుండా నాకు విశ్రాంతి ఎక్కడ? నీ అమోఘమైన ఆశీర్వాదము నాకు కలదు. నేను ఏ వేగముచే ఇచ్చటకు వచ్చితినో, అదే వేగముతో సముద్రమును దాటి ఆవలి ఒడ్డును చేరుతాను. అచ్చోట కోటానుకోట్ల వానర భల్లూక వీరులు నా కొఱకై నిరీక్షీంచుచున్నారు. నీ శుభ సమాచారమును ఆలకింపగానే వారికి ప్రాణములు తిరిగివచ్చును. తదుపరి వానర సైన్యముతో ప్రభువు ఈ ప్రదేశమునకు రాగలడు. మీరిర్వురు దివ్యసింహాసనము పై అధిష్ఠించి ఉండగా దర్శించి మా జన్మములను చరితార్థం ఒనరించుకొనగలము.


సీతా దేవి ఆప్యాయతతో ఇట్లు పలికెను. “కుమారా! నా మనస్సులో ఒక సందేహము ఇప్పటివరకు తొలగిపోలేదు. ఈవిశాల సాగరమును దాటగల సమర్థులు ఈ విశ్వములో ముగ్గురకు కలదు. నీకు, గరుత్మంతునకు, వాయు దేవునకు. ఇక వానర భల్లూకముల సహాయమున్నను మహాబలశాలియగు సుగ్రీవుడు ఈ దుర్లంఘ్యమైన మహాసముద్రమును ఎట్లు దాటగలదు? ఆ విశాల సైన్యముతోను శ్రీరామానుజునితోను శ్రీరాముడు ఎట్లా ఈ దారికి రాగలడు ? 


No comments:

Post a Comment