Tuesday, 18 January 2022

శ్రీ హనుమద్భాగవతము (134)



ఆయన ఆ దుఃఖమును దిగమ్రింగుకొంటూ సీతాదేవి పంపిన సందేశాన్ని ఇట్లా పలుకనారభించెను. "జగన్నాథ! సీతాసాధ్వీ అధిక దుఃఖముతో దినములను గడుపుచున్నది. ఆమెను దశాననుడు అశోక వాటికలో బంధించెను. క్రూరులైన రాక్షస స్త్రీలు రేయింబవళ్ళు కాపలాయున్నారు. ఆమె ఒకమాసిన చీరను గట్టుకొనియున్నది. ఆమె సుదీర్ఘ కేశములు జడలుగట్టినవి. సతతము నీ ధ్యానములోనే ఆమె కాలము గడుపుచున్నది. ఆమె పృథ్విపై శయనించుచున్నది. ఆహారమును, జలములను, విసర్జించిన కారణమున ఆమె మిగులు కృశించెను. శోకముతో ‘రామా! రామా!” అంటూ జపించుచున్నది. నీ యందుగల ఆనన్యభక్తితో ప్రేరితురాలై దుస్సహములగు కష్టములను అనుభవించుచు కఠోర తపమొనరించుచున్న తల్లిని నేను గాంచితిని. రఘునాయకా ! నేను మరలివచ్చుచున్నపుడు అమ్మ నాకు చూడామణిని ప్రసాదించి నీకు గుర్తుగా చూపుమని పలికినది. చిత్రకూటములో సంభవించిన కాకిరూపుడైన జయంతుని వృత్తాంతమును నీకు జ్ఞాపకము చేయవలసినదిగా పలుకుచు, స్వామీ! అంతటి మహత్తరమైన శక్తిసంపన్నుడవైన నీవు కూడ మౌనము నేల వహించితివి? నా అపరాధముల నన్నింటిని క్షమించి నన్నుద్ధరింపుమని అమ్మ నీతో విన్నవింపవలసినదిగా పలికినది. 


శ్రీ ఆంజనేయుని వచనములను ఆలకింపగానే శ్రీరామ చంద్రుని హృదయము దుఃఖముతో నిండిపోయెను, పద్మముల వంటి ఆయన నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింప ఆరంభించెను. సీతాదేవి పంపిన చూడామణిని తన హృదయమునకు హత్తుకొని శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో ఇట్లు పల్కెను. మిత్రమా ! ఈ చూడామణిని గాంచగానే నా హృదయము ద్రవించినది. దేవతలచే పూజింపబడు ఈ దివ్య మణి జలముల నుండి ఉద్భవించినది. నా మామగారైన జనక మహారాజు చేసిన యజ్ఞమునకు ప్రసన్నుడై సురేంద్రుడు ఈ దివ్య మణిని ఆయనకు ఒసంగెను. మా వివాహసమయములో నీ దివ్యమణిని జనకమహారాజు సీతకు ఒసంగెను. ఆమె శిరస్సుపై ఈ మణి సదా ప్రకాశించుండును. 


దోహ || సును కపి తోహి సమాన ఉపకారీ | 

నహి కోఉ సురనరముని తను ధారీ ||

ప్రతి ఉపకార కరౌ కా తోరా | 

సనముఖ హోఇ న సళత మన మోరా ||

సును సుత తోహి ఊరిన మై నాహి | 

దేఖే ఉకరి విచార మన మాహీ |


(మానస 5-31-3-4)


No comments:

Post a Comment