Sunday, 16 January 2022

శ్రీ హనుమద్భాగవతము (132)



శ్రీ రామలక్ష్మణుల ముఖములపై తాండవించూ ప్రసన్నతను గాంచి వానరేశ్వరుడైన సుగ్రీవుడు కూడా ఆనందమగ్నుడయ్యెను.


శ్రీహనుమంతుని అదృష్టము


మహాబలవంతుడైన దధిముఖునిద్వారా సుగ్రీవాజ్ఞను ఆలకింపగానే మహామతిమంతుడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, శివావతారుడైన శ్రీ ఆంజనేయుడు మొదలైన వారందఱు విశాలమైన వానర సమూహముతో ఆకాశమునకు ఎగురుతూ బయలు దేరిరి. ప్రస్రవణగిరిపై శ్రీ రామ చంద్రుని సుందరమైన పర్ణ కుటీరము కలదు. ఆ సమయములో పర్ణ కుటీరమునకు ముందున్న స్ఫటిక శిలపై రామానుజునితో పాటు శ్రీరాముడు ఆసీనుడై యుండెను. సమీపముననే వానర సుగ్రీవులు కూర్చొనియుండిరి.


ప్రసన్నులైన వానరులతో ఆకాశమార్గమునుండి వచ్చుచున్న అంగదుని గాంచి వానరేశ్వరుడైన సుగ్రీవుడు కమల నయనుడైన శ్రీ రాఘవేంద్రునితో నిట్లు పల్కెను “ప్రభూ! ధైర్యమును వహింపుడు, నిస్సందేహముగా శ్రీ పవనాత్మజుడు సీతను కనుగొనియే యుండును. లేనిచో నిర్ణయించిన గడువు సమాప్తముకాగా యువరాజైన అంగదుడు, వానరులు ఇంత ప్రసన్నులుగా తిరిగిరారు.


శ్లో||


న హన్యః కర్మణో హేతుః సాధనే ఒస్స హనూమతః 

హనూమతీహ సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమః| 

వ్యవసాయశ్చ శౌర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్ || (వాల్మీకి రామాయణం 5_64_88_84)


మతిసత్తమా! ఈ కార్యము నెరవేరుటలో శ్రీ ఆంజనేయుడు దప్ప అన్యులు కారణం అనుకుంట అసంభవము, వానరశిరోమణియైన శ్రీ ఆంజనేయునిలోనే కార్యసిద్ధికి తగు శక్తి, బుద్ధులు కలవు. ఆయనలోనే ఉద్యోగము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము ప్రతిష్ఠితము లైయున్నవి.


ఈ ప్రకారముగా వానరేశ్వరుడైన సుగ్రీవుడు బుద్ధి మంతులలో అగ్రగణ్యుడైన శ్రీరఘునందనుని ఊరడించుచుండగా శ్రీ ఆంజనేయుని అంగదుని ముందుంచుకొని హర్షాతిరేకముచే సింహనాదములను ఒనరించుచు వానరవీరులు వారి చెంతకు వచ్చిరి. వానర వీరులను గాంచగానే సుగ్రీవుడు ప్రసన్నుడై తన వాలమును పై కెత్తెను.


No comments:

Post a Comment