తదనంతరము అంగదజాంబవంతాదులను పరామర్శించి శ్రీ ఆంజనేయుడు వాసర భల్లూక సముదాయములను వెంట నిడుకొని శ్రీరామచంద్రునకు సుఖదాయకమైన ఈ సమాచారమును వినిపించుటకు వానరరాజైన సుగ్రీవుని చెంతకు బయలు దేరెను. శ్రీ ఆంజనేయుడు ముందు నడుచుచుండగా హర్షహృదయులై వానర భల్లూకములు ఎగురుచు, దుముకుచు ఆయనను అనుసరించిరి. ఆ సమయములో సిద్ధులు, సాధ్యులు మొదలగు వారందఱు వేదశాలి, మహాబలవంతుడు, బుద్ధి మంతుడునైన పవనాత్మజుని సజల నయనములతో దర్శించుచు అనేకవిధముల ప్రశంసింప దొడంగిరి.
ఆకాశములోనికి దుముకుచు, నెగురుచు హరషోన్మత్తులైన వానర భల్లూక వీరులు నందనవనమువలె భాసించు మనోహరమైన మధువనమును సమీపించిరి. కిష్కింధాధిపతియైన సుగ్రీవుడు మధువన రక్షణార్థమై తన మేనమామ, మహా బలవంతుడైన దధిముఖుడనే వాసర శ్రేష్ఠుని నియోగించెను. మనోహరమైన ఆ వనమును గాంచగనే వానర భల్లూకములకు మధువును ఆస్వాదింపవలెనని, ఫలములను ఆరగింపవలెనని కోరిక జనియించెను. వారు యువరాజైన అంగదుని అనుమతిని అడిగిరి, జాంబవంతుని, మహావీరుడైన శ్రీహనుమంతుని సంప్రదించి యువరాజు వారి కోరికను మన్నించెను. ప్రసన్నులైన కామ్రవర్ణముగల వానర భల్లూక వీరులందఱు మధువనమును ప్రవేశించి మధువును త్రాగుచు మధురఫలములను ఆరగుస్తూ ఎగురసాగారు. వానరులు మధువును త్రాగి మత్తులైరి. సీతా దేవి యొక్క సమాచారము తెలిసికొని ప్రసన్నులై మధువును త్రాగి మత్తులైన వానరులస్థితి విచిత్రముగా నుండెను. ఆనందమగ్నులై కొందఱు పాడుచున్నారు, కొందఱు నవ్వుచున్నారు, నృత్య మొనరించుచున్నారు, కొందఱు ఆకాశమునకు ఎగురుతూ దూకుచున్నారు, కొందఱు వాచాలురై పలుకుచున్నారు, కొందఱు మధువును త్రాగి మిగిలిన దానిని ఒలకబోయుచున్నారు. కొందఱు ఫలభరితములైన వృక్షశాఖలను త్రుంచుచున్నారు. ఉద్దండులైన మఱికొందఱు మదమత్తులై వృక్షములను పెకిలింప ఆరంభించారు. ఇట్లు అత్యంత రమణీయమైన మధువనమంతా నష్ట భ్రష్టమయ్యింది.
No comments:
Post a Comment