Wednesday 5 January 2022

శ్రీ హనుమద్భాగవతము (122)



వినయపూర్వకముగా శ్రీహనుమంతుడి ఇట్లు పల్కెను. "జననీ! ఈ వాసర భల్లూకముల శక్తి ఏపాటిది? వీరు ఒక చెట్టు కొమ్మనుండి మరియొక కొమ్మపైకి గెంతగలరు; కాని పరమ ప్రభువైన శ్రీరామచంద్రుని దివ్యశక్తినలన సర్వము సంభవమగును. ఆయన దయ గల్గినచో ఒక క్షుద్ర సర్పమైనను మహా బలవంతుడైన గరుత్మంతుని సహితము మ్రింగివేయగలదు. అవిటివాడు ఆకాశమునంటు పర్వతమునైనను దాటుటకు సమర్థుడగును. అవాఙమానసగోచరుడును, అచింత్యుడును అయిన శ్రీరామచంద్రుని దర్శించగానే సముద్రుడే స్వయముగా మార్గమును ఈయగలడు. సముద్రుడు మార్గమును ఇవ్వక విలంబమొనరించినచో వానిని శుష్కింపజేయుటకు సుమిత్రానందనుని బాణమొకటి చాలును. ఇక వానరేశ్వరుడైన సుగ్రీవుడు కోట్లకొలది వానర భల్లూక యోధులతో కదలివచ్చును. మహాశక్తి సంపన్నుడైన కపీశ్వరుడు శ్రీ రామచంద్రుని ఆజ్ఞా పరిపాలకుడు. ఆ ప్రభువు నిన్నుద్ధరించెదనని ప్రతిజ్ఞబూనెను. శ్రీరామచంద్రుని చెంత సకలసాధనములు కలవు. నీవు ధైర్యమును వహింపుము. నా ప్రభువు వెంటనే ఈ ప్రదేశమున కేతెంచి నిన్నుద్ధరింపగలడు. శ్రీ అంజనీనందనుని సమాధానమును విని సీతా దేవి ప్రసన్నురాలయ్యెను. ఆమె గద్గదమగు కంఠముతో ఇట్లు పల్కెను. “కుమారా! నాథుని చరణార విందములకు నా ప్రణామములను నివేదింపుము. దయనీయమైన నాస్థితిని ఆయనకు విన్నవింపుము. వెంటనే నన్నుద్ధరించుటకు రావలసినదిగా అంజలి ఘటించి ప్రార్థింపుము. నేను ప్రతి క్షణము శ్రీరామచంద్రుని నిరీక్షణములోనే జీవించుచుంటిని. రావణుడు పెట్టిన గడువు సమాప్తమైన మరుక్షణము ప్రాణము లాగవు. 


సీతా దేవి నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించు చుండెను. ఆమె వానిని తుడిచివేయుచు ధైర్యపూర్వకముగా తన ప్రాణనాథునకు సందేశము నిచ్చుచు మధ్యలో ఇట్లు పల్కెను. “కుమారా ! స్నేహపాత్రుడైన నా మరిదితో నన్ను క్షమింపవలసినదిగా చెప్పు. నా ఆశీర్వచనమును అతనికి అందింపుము. వానరరాజగు సుగ్రీవునకు, జాంబవంతునకు, యువరాజైన అంగదుడు మొదలగు వారికి నా ఆశీస్సులను అందింపుము. నేను మీతో గలసి వచ్చుచున్న శ్రీ రామ చంద్రునికొఱకై అనుక్షణము నిరీక్షించుచుంటినని పలుకుము.' ఇట్లు పల్కి అరవిందలోచనయైన సీత దుఃఖముచే పమిట చెంగుతో ముఖమును గప్పుకొనెను.


No comments:

Post a Comment