అంగదాది వీరులందరు శ్రీరఘునాయకుని చూసి హర్టోల్లాస పూర్వకముగా ఆకాశమునుండి భూమిపైకి దిగిరి. వానర వీరులందఱు శ్రీరామ లక్ష్మణుల చరణారవిందములకు, సుగ్రీవునకు ప్రణామములు అర్పించిరి. చూచితిని సీతా దేవిని అంటూ శ్రీపవనకుమారుడు త్రిభువన పావనములైన శ్రీరామచంద్రుని చరణకమలములపై బడెను. ప్రభు దర్శనముచే ఆయన ఆనందమునకు అవధులు లేకపోయెను. స్వామి! జానకీ దేవి కఠోరమైన పాతివ్రత్య నియమములను ఆచరించుచు సదా నిన్నే స్మరించుచు సశరీరముతో కుశలముగా ఉందని శ్రీ ఆంజనేయుడు పలికెను.
జగజ్జననియగు జానకిని చూడగానే శ్రీ ఆంజనేయుడు పలికిన మధుర వచనములను ఆలకింపగానే శ్రీరామ లక్ష్మణ సుగ్రీవుల ఆనందమునకు అంతు లేకపోయెను. శ్రీరాము ప్రభువు అతిశయమైన ప్రీతితో అత్యంతాదరముతో శ్రీ అంజనేయుని చూచెను. శ్రీ ఆంజనేయుడు ప్రభువు యొక్క చరణారవిందములకు మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి సుమిత్రానందనునకు, సుగ్రీవునకు నమస్కరించి ముకుళిత హస్తములతో శ్రీరామచంద్రుని దివ్యముఖారవిందమును తదేకదృష్టితో వీక్షించుచుండెను.
భగవంతుడైన రాముడు శ్రీ ఆంజనేయుని ఇట్లు ప్రశ్నించెను. “వాయునందనా! సీతా దేవి ఎక్కడ? ఆమె ట్లుండెను ? నా ఎడల ఆమె ఎట్టిభావము కలిగియుండెను. విదేహకుమారియైన సీతయొక్క సమాచారమునంతటిని చెప్పుము. శ్రీ పవనకుమారుడు మొదట దక్షిణ దిశ చూచినవాడై సీతకు శ్రద్ధాపూర్వకముగా సమస్కరించెను. తదనంతరం ఆయన నమ్రతతో ఇట్లు నివేదించెను, కరుణామయుడవైన ప్రభూ! నూఱు యోజనములు విస్తరించియున్న సముద్రమునకు ఆవలి తటముపై దశకంఠుని లంకానగరము కలదు. ఆ రాక్షసుల నగరములో అశోక వాటికలో అశోక వృక్షము చెంత అధిక దుఃఖమును అనుభవించుచు నిరంతరము నిన్నే స్మరించుచున్న సీతను గాంచితిని. ప్రభూ! జలహీనమైన మీనమువలె నీ వియోగముచే విలపించుచున్న ఆమె దుఃఖాతిశయమును చెప్పకుండుటయే మంచిది.
శ్రీ ఆంజనేయని వచనములను ఆలకింపగనే శ్రీరామ చంద్రుడు ధైర్యమును కోల్పోయెను. ఆయన నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహింపనారంభించెను. శ్రీ పవనకుమారుని నేత్రములు కూడ అశ్రుపూరితములయ్యెను.
No comments:
Post a Comment