విభీషణుడు అమితమైన ఆదరముతో రావణునకు ఇట్లు నివేదించడం ఆరంభించెను. “మహా మతిమంతుడా! పులస్త్య మహర్షి తన శిష్యునితో నీ కొక సందేశమును పంపెను. నీవు అహంకారమును విడచి సీతను ప్రభువుల ప్రభువైన శ్రీ రామచంద్రునకు సవినయముగా సమర్పించి ఆ దేవాది దేవుని శరణు వేడుము. నా ఉద్దేశ్యములో నీవట్లు ఒనరించినచో నీకు, నాకు, మన వంశమునకు, లంకా నివాసులకు శుభము కల్గును.”
విభీషణుడు పల్కిన అక్షరసత్యమైన ఆలోచనను ఆలకింపగానే మాల్యవంతుడనే మంత్రి ప్రసన్నుడయ్యెను; అతడు దశగ్రీవునితో నమ్రతాపూర్వకముగా ఇట్లు పల్కెను. "స్వామీ! నీ కనిష్ఠ సోదరుడు, పరమనీతినిపుణుడైన విభీషణుడు ఉచితమైన వాక్యములను పల్కెను. వీని ఆలోచనను మన్నించుటచే నీకు మంగళమగును.”
కాని కాలప్రేరితుడై ఉన్న దశాననునకు వారు పల్కిన హితవచనములు అప్రియములయ్యెను. అతడు కోపముతో పండ్లుకొఱకుచు ఇట్లు పల్కెను. “అసురులారా! శత్రువులను ప్రశంసించుచున్న ఈ ఇర్వురు మూఢులను ఈ సభ నుండి బయటకు నెట్టుడు.”
రావణుని అజ్ఞ ఆలకింపగానే వాని తాత యైన మాల్యవంతుడు సభను వీడిపోయెను. తన సోదరుని శుభమును కాంక్షించిన విభీషణుడు మరల వినయపూర్వకముగా ఇట్లు పలుకనారంభించెను. “దైత్యకులావతంసా! నీవు కృపాపూర్వకముగానే పల్కిన హితవచనములను అలకింపుము. విదేహరాజకుమారియైన సీతా దేవి లంకను ప్రవేశించిన సమయములో అనేక దుశ్శకునములు సంభవించుట నీవు ప్రత్యక్షముగా చూచితివి. అపుడే ఆ దుశ్శకునములను గుఱించి వివరించుటకు మంత్రులు సంకోచించిరి.
No comments:
Post a Comment