Thursday, 27 January 2022

శ్రీ హనుమద్భాగవతము (143)



రావణుని శిరముపై మృత్యువు నృత్యమొనరించుచుండెను. వానికి ముఖ ప్రీతికరములైన ఈ అసత్య వాక్యములు సత్యములుగా గోచరిం చెను; కాని అదే సమయములో నీతి కుశలుడు, రావణశుభచింతకుడు వాని తమ్ముడైన విభీషణుడు అన్నగారి చరణకమలములకు నమస్కరించి వినయ పూర్వకముగా ఇట్లు పల్కెను. "అగ్రజా! నీవు బుద్ధిమంతుడవు, విద్వాంసుడవు, సకలనీతిరహస్యములు నెఱిగినవాడవు, సావధానుడవై ఒకింత ఆలోచింపుము. ఈ సభాసదులందఱు సత్యముగా హితమును ఆలోచింపక నిన్ను సంతుష్టునిగా చేయుటకు ఇట్ల అసత్యప్రలాపములను ఒనరించుచున్నారు. శ్రీరామచంద్రుని దూతయైన ఒక్క వానరుడు దుర్లంఘ్యమగు లంకానగరమును ప్రవేశించి ప్రమదావన సహితముగా లంక నంతయు నష్ట భ్రష్టం ఒనరించెను. సైన్యస్థావరములను, వాహనములను, మహత్వపూర్ణములైన రహస్య ప్రదేశములను తగులబెట్టుటయేగాక అతడు అసంఖ్యాకులైన రాక్షసవీరులతో పాటు మన వీరకుమారుని కూడా సంహరించెను. అన్నా ! అంతటి వానరవీరులు కోటానుకోట్లుగా వచ్చినచో ఇక ఏమి సంభవించగలదో ఊహించుకొనుము. మన లంకానగరమంతా అనాథవలె అగ్నిజ్వాలలలో మండుచున్న సమయమున యీ బీరములు పల్కు వీరులందరు ఎచటకు పోయిరి ?


“రాక్షసేశ్వరా ! శ్రీరామచంద్రుడు ఒక సాధారణ మనుష్యుడనుకొంటివా? కాదు. ఆయన సాత్తుగా అవ్యక్తాత్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు, ధర్మపత్ని యగు సీతా దేవి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి. సీత ఈ లంకానగరమునకు యమపాశమువలె అఱుదెంచినది. కావున శ్రీరామచంద్రుని ధనువు నుండి తీక్షణములు కాలరూపములైన శరములు బయల్వెడలక మునుపే సమర ప్రియులు, నఖదంష్ట్రాయుధ విశారదులైన భల్లూక వానర వీర సమూములు లంకను ముట్టడించి నష్ట భష్ట మొనరింపక ముందే మేల్కొనుము. అసంఖ్యాకములైన రత్న రాసులతో మునుపే మిథిలా రాజకుమారిని శ్రీరామచంద్రునకు భక్తితో సమర్పింపుము. లేనిచో స్వయముగా కాలకంఠుడైన శంకరుడు యముడు మొదలగు వారందఱు నిన్ను రక్షించుచు సురపతి, పాతాళ లోకమును ప్రవేశించినను శ్రీరామచంద్రుని అమోఘమగు బాణము నుండి నిన్ను రక్షింపలేరు.”         


No comments:

Post a Comment