Monday, 31 January 2022

శ్రీ హనుమద్భాగవతము (146)



శ్లో || సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |

ఆప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్ల భఃః


(వా.రా. 1-16–21)


'రాజా! ఎల్లప్పుడు ప్రియమును గొల్పుమాటలను పల్కు వారు సులభముగా లభించెదరు; కాని వినుటకు ప్రియము లై నను పరిణామములో హితకరము లైన వచనములను పలుకు నా వారు, వినువారు కూడ దుర్లభులే'యని తెలిసికొనుము.

"అగ్రజా! నీవు నాకు పితృసమానుడవు. నీ పాద ప్రహారమునకు, కటుభాషణములకు నేను చింతించుటలేదు. కానీ నీవు నీ వినాశమును స్వయముగానే ఆహ్వానించుచున్న వాడవని నేను వ్యాకులము చెందుచున్నాను. నీవు నీ సభాసదులు కాలమునకు వశులైతిరి. కావుననే మీరు విపరీతముగా ఆలోచించుచున్నారు. నిర్ణయములను తీసికొనుచున్నారు. నీవు నీ పుత్రులు, సైన్యము, రాక్షసవంశము శ్రీ రామచంద్రునిచే సంహరింపబడుట నేను చూడలేను. ఈ కారణమువలననే శ్రీ రఘువీరుని శరణు వేడుటకు పోవుచున్నాను.”


విభీషణుడిట్లు పల్కి మంత్రులతో గూడినవాడై శ్రీరామచంద్రుని శరణువేడుటకు ఆకాశమార్గమున బయలుదేరెను, హృదయము ఆనందపుటలు ఉప్పొంగుచుండెను. శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహమును దర్శింపవలెననియు, ఆయన చరణారవిందములను శరణు పొందవలెననియు విభీషణుని మనస్సు ఆతురత చెందుచుండెను. అతడు తానిట్లా ఆలోచించుకొనుచుండెను. “ఆహా! నా అనేక జన్మముల పుణ్యము నేడు ఫలించబోవుచున్నది. దేవతలు, మహర్షులు జన్మజన్మముల పర్యంతము తపమొనరించినను అ భక్తసుఖదాయకుని చరణారవిందములను పొందలేరు. పరమప్రభువగు శ్రీ రామ చంద్రుని అరుణారుణ చరణారవిందములను నేడు నేను దర్శింప గల్గెదను. ఎవ్వని చరణ కమలముల సంస్పర్శనముచే పాషాణమైన గౌతమునిపత్నియైన అహల్య స్వస్వరూపమును పొంది సంసారమును తరించెనో, ఎవని అరుణ చరణములను భగవతియైన సీతా దేవి తన హృదయమున ధరించియుండెనో, కర్పూర గౌరాంగుడైన శ్రీమహా దేవుడు తన హృదయాంతరంగములో సదా ధ్యానించుచుండునో, లోకపావనములైన ఎవని పాదుకలను భాగ్యవంతుడైన భరతుడు శ్రద్ధాభక్తులతో నిరంతరము పూజించుచుండెనో, అధముడను రాక్షసుడనునైన నేను శ్రీ రామచంద్రుని ఆ దివ్యచరణములను దర్శించు భాగ్యమును పొందబోవుచున్నాను.

No comments:

Post a Comment