Wednesday 12 January 2022

శ్రీ హనుమద్భాగవతము (129)



నేను సీతా దేవి చరణారవిందములను దర్శించి, స్పృశించి ధన్యుడనైతినని శ్రీహనుమంతుడు పలుకగా జాంబవంతుడు ఆ మహాభక్తుని ప్రేమతో ఆలింగనం ఒనరించుకొనెను. ఆ భల్లూక వీరుడు గద్గద స్వరముతో 'పవనకుమారా ! నీవు మా అందఱి ప్రాణములను రక్షించితివని కొనియాడెను. సీతా దేవి సురక్షితముగా ఉందనే విషయము తెలుపగానే వానర భల్లూక వీరులందఱు కిలకిలారవములు ఒనరించుచు ఎగురడం ఆరంభించిరి. హర్షాతిరేకముచే వానరులందఱు తమ వాలమును పైకె కెత్తినవారై నృత్యం ఒనరించారు. కొందఱు బలిష్ఠములు దీర్ఘములు నైన తమ వాలములను గిరగిరద్రిప్పిరి. మఱికొందరు శ్రీ ఆంజనేయుని వాలమును ముద్దాడ ఆరంభించిరి; కొందఱు ఆయన ఆరగింపవలసినదిగా సమ్ముఖమున కందమూలఫలములను ఉంచి ప్రార్థిం౦చిరి. మఱికొందఱు తదితరములగు సేవలను ఒనరింపసాగిరి. ఈశ్వరనందనుడు కొందఱి చరణములకు ప్రణామములను అర్పించెను. మఱికొందరిని ఆలింగనం ఒనరించుకొనెను, పిన్న వయస్కుల శిరముపై దక్షిణహస్తము నుంచి ఆశీర్వదించెను. మఱికొందరిని వీపు పై నిమిరి ప్రశంసించెను. సర్వసమర్ధుడగు ఆ రుద్రాంశుడు కొలదిక్షణములలోనే సకల వానర భల్లూక వీరులను కలుసుకున్నాడు. శోకహరుడైన శ్రీకపిసత్తముడు సీతను దర్శించిన విధానమును, రావణునకు చేసిన ఉపదేశమును, లంకా దహన కార్యక్రమమును యువరాజైన అంగదునకు వివరించెను. శ్రీ రామభక్తుడైన అంగదుడు పరమానంద భరితుడై శ్రీ ఆంజనేయునితో


శ్లో॥ సత్తే వీర్యే న తే కశ్చిత్ సమో వానర విద్య తే ॥ 

యదవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః | 

జీవితస్య ప్రదాతా న స్త్వమేకో వానరోత్తమ ||

త్వత్ప్రసాదాత్ సమేష్యామః సిద్ధార్థ రాఘవేణ హ | 

అహో స్వామిని భక్తిరహో వీర్యమహో ధృతిః ||


(వాల్మీకి రామాయణము 5_57_45_4)


వానర శేషా ! బలపరాక్రమములలో నీతో సమానమైన మరియొకరు లేరు. నీవీ విశాలమైన సముద్రమును దాటి ఆవలి ఒడ్డు చేరి మరలివచ్చితివి. కపిశిరోమణీ ! మా అందఱికి జీవనదాతవు నీ వొక్కడవే. నీ అనుగ్రహ విశేషము చేతనే మేమందఱము సఫలమనోరథులమై శ్రీ రామచంద్రుని దర్శింప బోవుచున్నాము. పరమప్రభువైన శ్రీరఘునాయకుని ఎడల నీ భక్తి అద్భుతము. నీ పరాక్రమము, నీ ధైర్యము ఆశ్చర్య జనకములు.


నీవు మహాసాధ్వియైన సీతాదేవి దర్శనమును బొందు అత్యంతము సౌభాగ్యకరమైన విషయము, సుఖప్రదమైన సమాచారముచే శ్రీరామచంద్రుని శోకమంతయు నశించును.


No comments:

Post a Comment