Friday 7 January 2022

శ్రీ హనుమద్భాగవతము (124)



సీతాదేవి నేత్రములు మరల అశ్రుపూరితములయ్యెను. కండ్లను తుడుచుకొనుచు ఆమె "కుమారా! హనుమాన్ ! వెంటనే వెళ్ళుము. ప్రభువును తోడ్కొని శీఘ్రముగా తిరిగి రమ్ము. విలంబనం ఒనరింపకుము. నీకు శుభమగుగాక!” అని పల్కెను.


సృష్టిస్థితిసంహార కారిణియైన సీతా దేవివలన ఆశీర్వాదము పొంది, శ్రీరామచంద్రుని చరణారవిందములను మనస్సునందు స్మరించుకొనుచు శ్రీహనుమంతుడు ఎగిరి అరిష్టగిరి పైకి విశాల శైలము పై నిలువబడి వాయునందనుడు, కపి నైన శ్రీహనుమంతుడు తన శరీరమును పెంచెను. ఆయన దక్షిణమునుండి 'సముద్రమును' దాటుటకు వేగముగా ఆకాశమునకు ఎగిరెను. ముప్పది యోజనముల ఎత్తు, పదియోజనముల వెడల్పు కలిగిన శోభాయుతమైన ఆ మహీధరము శ్రీ ఆంజనేయుని పదఘట్టనముచే వృక్ష శిఖర సహితముగా భూమిలోనికి క్రుంగిపోయెను.


అరిష్టగిరినుండి గగనతలమునకు ఎగిరినవాడై మహాబలవంతుడు, వజ్రాంగుడునై శ్రీహనుమంతుడు భయంకరముగా గర్జించెను. ఆ భీషణ గర్జనమునకు దిశలు కంపించెను. ఆకాశము విదీర్ఘమయ్యెను; మేఘములు అటునిటు చెదరిపోయెను. సముద్రతరంగములు ఆకాశమునకు లేచెను. గిరిశృంగములు భగ్నమై దొర్ల దొడంగెను. అది ఇది అననేల! లంకానగర మంతా కదలిపోయెను. భూకంపము వచ్చినదా అని అసురులు ఎక్కడివారక్కడనే ఉండి కంపింప దొడంగిరి. గర్భవతులైన రాక్షసస్త్రీలకు గర్భపాతమయ్యెను. సభలో సభాసదుల మధ్యలో సింహాసనమును అధిష్ఠించి ఉన్న దశకంఠుడు ఆ తాకిడికి సింహాసనము పై నుండి క్రిందపడెను. రత్నమయమైన వాని కిరీటము శిరమునుండి జారిపడెను. ఇట్లా అనేకములైన అపశకునములను గాంచి అసురులు రాబోవు వినాశనమును చర్చించుకొనుచుండిరి. అందఱియందు భయము, ఉదాసీనత వ్యాపించెను.


No comments:

Post a Comment