"ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ధ్ర
దృష్ట్యాత్రి విష్టపపదం సులభం భజంతే
దృష్టిః ప్రహృష్ట కమలో దరదీప్తి రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః"
ఇందు ఇష్టిని అనగా యజ్ఞ కర్మను చేసి స్వర్గమనే ఫలాన్ని లక్ష్మి యొక్క కటాక్షం వల్లనే పొందుతున్నారు. కర్మ తనంతట తాను ఫలం ఇస్తుందన్నవారికి అట్లా కాదని, అమ్మవారి శక్తి వల్లనే అట్టి ఫలాన్ని పొందుతున్నారని చెప్పారు. తరువాత శ్లోకంలో అందరు దేవతలు, ఒకే ఒక పరమాత్మ స్వరూపాలని చెప్పారు.
"గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
స్పష్టస్థితి ప్రలయకేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై"
ఇందులో ఒకే పరమాత్మ త్రిమూర్తులుగా ఉన్నాడని, సృష్టి, స్థితి, సంహారాలను వారు చేస్తున్నారని వారిట్టి పనులు చేసేటపుడు వారలకు శక్తిగా ఈమె ఉంటోందని అన్నారు.
నాల్గు శక్తులు, ముగ్గురికి ఉండడమేమిటి? గీర్దేవత యనగా సరస్వతి - బ్రహ్మ యొక్క శక్తి, గరుడధ్వజుడైన విష్ణువునకు మహాలక్ష్మి, రుద్రునకు శాకంభరి, శశి శేఖరవల్లభ అనే ఇద్దరూ భార్యలు.
శాకంభరిని గురించి దేవీపురాణం చెప్పింది. కఱవుకాటకాలలో శాకములను తన ఒంటి పై పండించి ప్రజలనాదుకునేది. అందువల్ల ఆమె శాకంభరి. శివుని శక్తి.