ద్వారకా మఠంలో నున్న గురుపరంపరలో క్రీ.పూ. 509 కాలానికి వారి లెక్కలు ఇంచుమించు సరిపోతున్నాయి. కంచి, ద్వారక, పూరి మఠాల లెక్కలు క్రీ.పూ. 500 సంవత్సరాల దరిదాపులో ఉన్నాయి. థియోసఫిస్టు అనే పత్రికలో పాశ్చాత్యులచే కూడా పొగడబడిన సుబ్రహ్మణ్య అయ్యర్ ద్వారకా మఠపు లెక్కల ప్రకారం శంకరులు క్రీ.పూ. 600-500 కాలానికి చెందిన వారని అన్నారు.
ఇంద్రాంశతో సుధన్వుడనే రాజు పుట్టాడని చెప్పాను. శంకరులతో అతడు మాట్లాడినట్లు తమ దగ్గర తామ్ర శాసనముందని ద్వారకా మఠం వారన్నారు. అది ప్రకటింపబడింది కూడా.
బద్రీనాథ్ జ్యోతిర్మఠం వారు మఠానుశాసనం (1946) ప్రకటించారు. వీరు శంకరుల కాలం క్రీ.పూ. 509 అనే నిర్ణయించారు.
ఇట్లా అనేక మఠాలు, ఏకాభిప్రాయంతో ఉండగా ఇదంతా తప్పనడం నేటి చారిత్రకుల మాటలకే పట్టం గట్టడం, దీనినే ప్రచారం చేయడం బాగుందా?
నేపాల్ రాజవంశావళిలో శంకరులు, నేపాల్ వెళ్ళినట్లు, వృషదేవవర్మ అపుడు పాలిస్తున్నట్లు కలి ప్రారంభించిన 2600 సంవత్సరాలకు అతడున్నట్లుంది. అనగా క్రీ.పూ. 5వ శతాబ్దమే కదా!
జైనుల గ్రంథాలలో శంకరులను ఖండించినా, వీరిని శివునిగా పేర్కొన్నారు. ఇది శివావతారాన్ని తెలుపుతోంది. ఇక శంకరులు సిద్ధి పొందిన సంవత్సరం కూడా ఉంది. "ఋషి: బాణాః తథా భూమి మర్త్యాక్షా" అని. ఋషి-7, బాణం-5, భూమి-1; మర్త్యాక్షం-2. అనగా 7512. త్రిప్పితే 2157. వారి జైన యుధిష్ఠిరంతో పోలిస్తే, కలిలో 2625; అనగా క్రీ.పూ. 477లో శంకరులు సిద్ధిని పొందారు. తామ్రాక్ష సంవత్సరంలో సిద్ధియని యుంది. అనగా రక్తాక్షి సంవత్సరమే.
No comments:
Post a Comment