Friday 12 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 158 వ భాగం



నిధి నాగేభ వహ్ని అట్టే అని ఉంది. నిధి-9; నాగ-8; ఇభ=8; వహ్ని-3; అనగా 9883. త్రిప్పితే 3889. కలి 3102 ఆరంభం కదా. అందు 3889 తీసివేస్తే క్రీస్తు తరువాత 787-788.


కారణాలిట్లా చెప్పారు. శంకరుల రచనలలో ఇతర సిద్ధాంత ప్రవర్తకులను తడమడం ఉంది. క్రీ.పూ. 560 నుండి 480 వరకు బుద్ధుడు కాలమని అన్నారు. అటువంటప్పుడు శంకరుల కాలమూ అదే అవుతోంది కదా. బౌద్ధ మతాన్ని చాలామంది రాజులు పోషించినట్లుంది. అటువంటప్పుడు శంకరుల కాలంలో బౌద్ధం క్షీణించిందనే మాట ఎట్లా కుదురుతుంది? కనుక గౌతముని కాలంలో శంకరులున్నారనుట అసంగతమని చారిత్రక వేత్తలంటారు.  


దాని తరువాతే కాళిదాసు కాలమని; క్రీ.పూ. 600 కాని 500 కాని శంకరుల కాలం కాదని చారిత్రకులంటారు.


శంకరులు భాష్యంలో బౌద్ధమత సిద్ధాంతాలు


వైభాషికమని, సౌంతాంత్రికమని, యోగాచారమని, విజ్ఞాన వాదమని ప్రధాన బౌద్ధ సిద్ధాంతాలు. వైభాషికాన్ని, దిజ్నాగుడు, యోగాచార, విజ్ఞాన వాదాలను నాల్గవ శతాబ్దికి చెందిన అసంగుడు, వసుబంధుడు లేవదీసారు. మాధ్యమిక లేదా శూన్య వాదాలను బలపరచినవాడు నాగార్జునుడు. ఇతడు క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినవాడు. 2,4, 6 శతాబ్దాలకు చెందిన బౌద్ధ సిద్ధాంతాలను శంకరులు ఖండించగా వీరు క్రీస్తు పూర్వం ఎట్లా ఉంటారని చారిత్రకులు ప్రశ్నిస్తున్నారు.


కనిష్కుని కాలంలో బౌద్ధం హీన యానమని, మహాయానమని రెండుగా చీలిందని అందు మహాయానాన్ని గురించి శంకరుల శిష్యుడు, పద్మపాదుడు తన పంచపాదికలో పేర్కొన్నాడని కనిష్కుడు క్రీ. శ. చెందినవాడు కావడం వల్ల కనుక శంకరులెట్లా క్రీస్తు పూర్వానికి చెందినవారౌతారని ప్రశ్నిస్తున్నారు.


No comments:

Post a Comment