Thursday 11 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 157 వ భాగం



సంధ్యాకాలంలో మద్దిచెట్టు పుష్పాలతో వినిపిస్తుంది. శివుడపుడు నాట్యం చేస్తాడు. ఆ పూలు, ఆ చెట్టును అలంకరించడమే కాకుండా శ్రుతి శిరస్సులను (ఉపనిషత్తులు) అలంకరిస్తాయి. అనగా తలపైన, చెవులలోను అలంకరింపబడతాయి. శివుడు శ్రుతి శిరస్సులతో ఉంటాడు. ఆ చెట్టు తుమ్మెదలతో ఉండగా శివుడు భ్రమరాంబికతో ఉంటాడు. చెట్టు మంచి వాసనతో ఉండగా శివుడు మంచి వాసన (భావన)తో ఉంటాడు. దాని పూలు మహాభోగులకు అలంకారంగా ఉండగా శివుడు భోగీంద్రుడై వాసుకి ఆభరణంగా కల్గియుంటాడు. వీటి పూలు అన్ని పూలకంటే పూజ్యములు కాగా శివుడు మంచివారిచే, దేవతలచే పూజింపబడేవాడై యుంటాడు. ఇది సుగంధ గుణాన్ని బట్టి కనుగొనబడితే శివుడు మంచి గుణాలను బట్టి వ్యక్తమౌతూ ఉంటాడు. గుణానికి దారమని, గుణమని అర్ధం. పువ్వులను దారాలతో గ్రుచ్చుతాం. అతడుత్తమ గుణాలతో ఉంటాడనీ అర్థం. మద్దిచెట్టును మల్లెతీగ చుట్టుకొని యుండగా, శివుడు, అమ్మవారిచే ఆలింగనం చేసికొనబడియుంటాడు. వసంతంలో మల్లెలు, మామిడి పండ్లు వస్తాయి. శంకరులు మల్లెలా, జ్ఞాన రసంతో కూడిన మామిడి పండులా ఉంటారు. అదే అద్వైత రసం.


శంకరుల కాలం


వీరు సిద్ధి పొందిన సంవత్సరానికి చెందిన శ్లోకాన్ని లోగడ పేర్కొన్నాను. ఆ పుస్తకంలోని ప్రాచీన శంకర విజయ శ్లోకంలో అవతార సంవత్సరం చెప్పబడింది. అందు, అనల సేవధి భావనేత్రే అని ఉంది. అనగా 3-9-5-2-3952. కటపయాది సూత్రంచే త్రిప్పితే 2593. కలిశకం క్రీస్తుపూర్వం 3102లో ఆరంభం. అందు 2593 తీసివేయగా క్రీ.పూ. 509 అయింది.


అయితే దీనికి విరుద్ధంగా పాశ్చాత్య పరిశోధకులు క్రీ.శ. 788-820 అన్నారు. అంటే నేను చెప్పినదానికి దీనికీ 1300 సంవత్సరాలు తేడా ఉంది. వీరెట్లా నిర్ణయించారంటే మరొక శ్లోకాన్ని ప్రమాణంగా స్వీకరించారు ఈ శ్లోకంలో.


No comments:

Post a Comment