Friday 19 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 165 వ భాగం



జైనులు కూడా జైన మత వ్యాప్తి చేసిన వర్ధమాన మహావీరుణ్ణి 24వ తీర్ధంకరునిగా పేర్కొన్నారు. మా మాతం, అనాదియని వారు అంటారు. జైన మత స్థాపకుడు క్రీ. పూ. 9వ శతాబ్దానికి చెందినవాడని అన్నారు.


ఇక బ్రహ్మ సూత్రాలలో బౌద్ధం ఖండింపబడింది. కనుక, గీత బ్రహ్మ సూత్రాలూ బుద్ధుని తరువాత వచ్చాయనడం సబబు కాదు. ఎందరో బుద్ధులున్నారని బౌద్ధులే అన్నారు. వారి సిద్ధాంతాన్ని ఖండించాడు వ్యాసుడు.


వ్యాసుడు గాని, కృష్ణుడు గాని, గౌతమ బుద్ధుని తరువాత వచ్చారనడం సబబు కాదు.


ఇక క్రీస్తు శకారంభంలో కనిష్కుడున్నాడని అతని కాలంలో హీనయానం, మహాయానంగా బౌద్ధం చీలిందని అందువల్ల దాని తరువాత శంకరుల జన్మమని అనడం కుదరదు. అంతకుముందు నుండే ఈ సిద్ధాంతాలున్నాయని చెప్పాను.


ఇక ఏడవ శతాబ్దానికి చెందిన జ్ఞాన సంబంధుణ్ణి ద్రవిడ శిశువని శంకరులు, సౌందర్యలహరిలో పేర్కొన్నారని అనడం సబబు కాదు. సౌందర్యలహరీ వ్యాఖ్యానాలలో ఆ ద్రవిడ శిశువు, శంకరులే అని వ్రాసేరు. శంకరులే పాలను అమ్మవారికి నివేదించారని అన్నారు.


ఏడవ శతాబ్దానికి చెందిన సిరు తొండ నాయనార్ ని సుతాద్రోహిగా వీరి సోత్రాలలో పేర్కొన్నారని అంటారు. కొన్ని స్తోత్రాలు వీరి పేరున ఉన్నా, అన్నీ వీరు వ్రాయలేదు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, కనకధారాస్తవం వంటి వాటినే వీరు వ్రాశారు. ఎందుకన్నీ వ్రాయలేదో చెబుతాను చూడండి. దేవీ అపరాధ స్తోత్రంలో చెడ్డ కొడుకు పుట్టవచ్చుగాని, చెడ్డ తల్లి పుట్టరమ్మా "కుపుత్రో జాయేత, కుమాతా నభవతి" అని వ్రాసి 85 సంవత్సరాలున్న నేను, ఎక్కడ శరణు జొచ్చుతానమ్మా అని వ్రాసినట్లుంది. 32 సంవత్సరాలు బ్రతికిన శంకరులిట్లా వ్రాస్తారా? శంకర మఠాలలో చాలామంది శంకరాచార్యులున్నారు. అందొకరు వ్రాసి యుంటారు.


No comments:

Post a Comment