Friday 26 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 172 వ భాగం



వీరి గ్రంథాలను, అందు పేర్కొన్న పంక్తులను పరిశీలించగా ఈ శ్లోకం అతిశయోక్తి అనిపించదు.

ప్రపంచంలో ఏ మతం వారైనా తత్త్వం తెలిసికోవడం కోసం గ్రంధాలను నేటికీ పరిశీలిస్తూ ఉంటారు. వారు సర్వజ్ఞులు కనుకనే, మిగతా శాస్త్రాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించగలిగారు. ఇదంతా "అమల అద్వైత సుఖం" కోసమే. అనగా మచ్చలేని కోరికలేని దానికోసమే. ఈశ్వరుడూ, నేనూ ఒకటని అనినపుడు మనస్సెక్కుడుంది? చివరి పంక్తిలో అన్ని సిద్ధాంతాల వల్ల పొందదగిన సుఖం అంతా అద్వైతంలోనే ఉందని ఉంది.

ఈ శ్లోకాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?

గీతలో ఒక క్లిష్టమైన శ్లోకం ఉంది. దీనినర్ధం చేసుకోవడం కష్టం. కృష్ణుడు, అర్జునునకు జ్ఞానయోగాన్ని చెబుతూ నశించనది ఆత్మయే యని దానితో సంబంధం దృఢ సంకల్పంతో పెట్టుకోవాలని, లేకపోతే మీమాంసకులు చెప్పిన కర్మకాండలలో మునిగిపోతావని అపుడు మనస్సు నిశ్చలంగా ఉండదని అన్నాడు. ఇక్కడ వేదాంతం నుండి కర్మకాండ వేరు చేయబడింది. వేదం కర్మకాండలను చెబుతూ వాటివల్ల సత్త్వ, రజస్తమో గుణాలతో ఉంటావని, కాని త్రిగుణాతీతమైన ఆత్మను పట్టుకోవాలని అంటూ ఈ దిగువ శ్లోకాన్ని చెప్పింది. 

"యావానర్ధ ఉదపానే సర్వతః సంపుతోదకే 

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః" (11-46)

అనగా అంతటా నీటి వెల్లువయున్నా, నుయ్యి, చెఱువు వంటి జలాశయాల వల్ల ఏ ప్రయోజనమో సిద్ధిస్తుందో అనగా స్నానపానాదులు సిద్ధిస్తున్నాయో. అట్లాగే బ్రాహ్మణునకు సర్వవేదాల ప్రయోజనమూ అంతే.

అయితే ఈ శ్లోకం అర్ధం కావడం లేదు. చిన్న నీటి యూటవల్ల ఏ ప్రయోజనమో పెద్ద చెఱువు వల్ల అంతే ప్రయోజనం అనేది అర్ధమౌతోంది. కాని జ్ఞానం కలిగిన బ్రాహ్మణునకు అన్ని వేదాలూ అంతే అనినపుడు అర్థం కావటం లేదు. శంకర విజయంలోని ఒక శ్లోకాన్ని చూసినపుడు అర్ధమైంది.


No comments:

Post a Comment