Tuesday, 23 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 169 వ భాగం



హాలుడు - పూర్ణవర్మ

గురురత్నమాలలో హాలునిచే పోషింపబడిన కుమారిలుడు, కాశిని విడిచి పెట్టాడని యుంది. శాతవాహన చక్రవర్తియైన హాలుడు క్రీ.శ. 1వ శతాబ్ది యని చారిత్రకులు నిర్ణయం. కాని కె.జి నటేశ అయ్యర్ 'జిజ్ఞాస' అనే పత్రికలో కలియుగం ప్రారంభమైన తరువాత 74వ రాజు హాలుడని నిర్ణయించారు. పురాణాల లెక్కల ప్రకారం ఇది శంకరుల కాలమౌతోంది. కలి తరువాత 2600 సంవత్సరాలు.

ఆపైన వాయుపురాణంలో "తతః సంవత్సరం పూర్ణో హాలో రాజా భవిష్యతి" అనగా పూర్ణుడనే పిలువబడే హాలుడు రాజు కాబోతున్నాడని అర్థం. 

శంకరులు, సూత్ర భాష్యంలో పూర్ణవర్మ ప్రస్తావన తీసుకొని వచ్చారు కదా! యజ్ఞదత్త, దేవదత్త వంటి పేరే ఆదియని లోగడ చెప్పాను. తరువాత పరిశోధనల వల్ల పూర్ణవర్మయే హాలుడని తెలియవచ్చింది. పురాణాల లెక్కల ప్రకారం అతని కాలం క్రీ.పూ. 500. మనమూ అట్లాగే అంటున్నాం.

అసాధారణ బాలుడు

పుట్టుకనుండి తన అసాధారణత్వాన్ని చూపించారు శంకరులు. మూడవ యేట లోపుగా ప్రాంతీయ భాషలో, ఐదవ యేడు పూర్తి అయ్యేటప్పటికి సంస్కృతంలో ప్రావీణ్యం చూపించారు. వారి ప్రాంతీయ భాష తమిళం అయి యుంటుంది. మూడవ యేటనే జ్ఞాన సంబంధులు తేవారాన్ని కీర్తించారు. ఇవన్నీ కాకమ్మ కథలని అనుకుంటాం. కాని ఈనాటికీ అట్టి బాలమేధావుల గురించి పత్రికలలో చదువుతున్నాం. గత జన్మ సంస్కారాలు, ఒక్కమాటుగా, పొటమరించాయని చెప్పడం కంటె సమాధానం ఏం చెప్పగలం? గత జన్మల గురించి బౌద్ధ జైనులూ నమ్ముతారు. అయితే శంకరుల గురించి, సంబంధుల గురించి గత జన్మలున్నాయని చెప్పకూడదు. వారు అవతార మూర్తులే.

చిన్ననాటనే ఉపనయనం

ఐదవ యేటనే ఉపనయనం జరిగింది. జ్ఞాన సంబంధులు మూడవ యేటనే తేవారాన్ని కీర్తించారని, తీర్ధ యాత్రలు ముగించుకొన్న తరువాత వారికి ఉపనయనం జరిగిందని పెరియ పురాణంలో ఉంది. పుట్టిన తరువాత ఏడవ యేటనే ఉపనయనం జరగాలి. బ్రహ్మ వర్చస్సును కోరుకొనేవారికి ఐదవ యేట చేయవచ్చని శాస్త్రాలన్నాయి.

No comments:

Post a Comment