Monday, 29 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 175 వ భాగం



"దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం 

అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే 

దుష్కర్మ సుర్మమపనీయ చిరాయ దూరం 

నారాయణ ప్రణయినీ నయనాం బువహః'


కర్మ బాగా పేరుకొని పోయినప్పుడు, అమ్మవారి కటాక్షం మరొకవైపున ఉంటుంది. అయితే ఏమిటి? వర్షించే మేఘం, ఏ అండమాన్ అంత దూరంగా ఉండవచ్చు. కాని ఋతువులలో వీచే గాలులు వాటిని ఇక్కడకు తీసుకొని రావాలి కదా! అమ్మవారి దయ, అట్టి అనుకూల పవనమన్నమాట. ఆ గాలి, కటాక్షమనే వర్షాన్ని, వీరు చెడ్డకర్మలు చేసినా కురిపించుగాక. దయాపాత్రుని కానివానిపై కూడా దయ, అనుగ్రహాన్ని చూపించవచ్చు. ఆపైన గాలి, మేఘం, ప్రాణుల అర్హతలను పరికిస్తాయా?


'ద్రవిణ' అనే మాటకు సంపదయనే కాదు, బంగారమనీ అర్ధం ఉంది. ఈ ద్రవిణధారయే కనకధార స్తోత్రానికి ఆ పేరే ఉంది.


తనకోసమా డబ్బు? పాపం, ఈ చాతక శిశువుపై దయ చూపింపుమని. కనుక ఇది అలసి సొలసి యుంది.


కవిత్వంలో చకోరమని, చాతకమనే పక్షులున్నాయి. ఇవి నేడు కనబడవు. చకోర పక్షి, వెన్నెలనే ఆహారంగా గ్రహిస్తుందట.


సౌందర్యలహరిలో (63 శ్లోకం) అమ్మవారి మందహాసం నుండి వెన్నెల కిరణాలు వస్తున్నాయని; చకోర పక్షులు త్రాగగా అవి వెట్టి తీపిగా ఉండడం వల్ల నాల్క మొద్దు పడిందని అందువల్ల పుల్లని వస్తువుల కోసం చూడగా చంద్రుని నుండి వచ్చే వెన్నెలయనే అమృతాన్ని అన్నపు గంజియనే భ్రాంతితో ప్రతిరాత్రి తాగుతున్నాయని చమత్కరించారు. అయితే చాతక పక్షికి కంఠంలో చిల్లుంటుంది. ఇది ముక్కుతో తినదు. తింటే ఆ చిల్లునుండి బైటకి వచ్చేస్తుంది. ఆహారం తన ముక్కుతో కంఠ రంధ్రంలోకి ప్రవేశపెట్టలేదు. ఆ రంధ్రంలో పడే వర్షపు చినుకులు ఆ పక్షికి ఆహారం. వర్షం లేకపోతే ఆకలితో ఉంటుంది.


No comments:

Post a Comment