Saturday, 27 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 173 వ భాగం


శంకరులు అన్ని శాస్త్రాలూ చదివి ఏ సుఖం పొందారో అదంతా అద్వైత జ్ఞానంలోనే ఇమిడి యుందని దీనివల్ల అనంత సుఖం వస్తోందని:

"కూపే యోఽర్ధః సతీర్థే సుపయసి విదధే హంత నాంతర్ భవే త్ కిం?" అని ప్రశ్నార్థకంగా చెప్పారు. నూతి నీటివల్ల పొందే ప్రయోజనం, నదిలోని నీటివల్ల పొందడం లేదా అని ప్రశ్నించారు.


ఎన్ని శాస్త్రాలు చదివినా అద్వైత జ్ఞానం వల్ల పొందినంత సుఖాన్ని వాటివల్ల పొందలేకపోయారు. నది నీటివల్ల పొందే ఆనందంతో పోలిస్తే నూతినీరు, అంత సుఖాన్ని ఇయ్యడం లేదని వారి భావన. నూతినీటిని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అట్లా నది నీటిని చేయనవసరం లేదు. రెంటిలోనూ నీరు ఉండవచ్చు.


కర్మకాండల వల్ల పొందే సుఖం కొద్దిగా ఉంటుందని, జ్ఞాన కాండం వల్ల సుఖం నది నీరు వంటిదని అర్థం. జ్ఞాన కాండ వల్ల ఎక్కువ సుఖాన్ని పొందవచ్చు. దీని తాత్పర్యం ఏమిటంటే అద్వైతం, అఖండ నది వంటిదని, అన్ని శాస్త్రాలు నుయ్యి, చెఱువు వంటివని, ఈ నీటివల్ల ఏ సుఖము పొందుతున్నావో అన్ని సుఖాలు అద్వైతమనే నదిలో మునిగినప్పుడు కలుగుతాయని అర్థం. ఈ శంకర విజయ శ్లోకం పై గీతాశ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినట్లుంది.


(గంగా తీరంలో ఉండేవారు నూతిని ఉపేక్షించినట్లు జ్ఞానం లభిస్తూ ఉంటే కర్మకాండలను ఆశిస్తాడా? అని కొందరన్నారు. అనాయాసంగా నదిలో నీరు లభిస్తూ ఉండగా నూతి గురించి విచారించనట్లు జ్ఞానం కలిగినవారికి ఈ కర్మ కాండల వల్ల ప్రయోజనం లేదని కొందరన్నారు. నుయ్యి, స్నాన "పానాదులకు ఎంత ఉపయోగిస్తుందో పెద్ద చెఱువు కూడా అంతే ఉపయోగిస్తుందని అట్లాగే వేదాల వల్ల ఏ ప్రయోజనం ఉందో అంత ఉపయోగం జ్ఞానులకు జ్ఞానం వల్ల కల్గుతోందని కొందరన్నారు.


బావుల వల్ల స్నానపానాది ప్రయోజనం ఎంత మాత్రం కలుగుతుందో నదులవల్ల కలుగు అనంత ప్రయోజనాలలో అంతర్ధానం చెందినట్లుగా కర్మానుష్టానం వల్ల వచ్చే ఫలం, జ్ఞానికి కలిగే మోక్షరూప ఫలంతో అంతర్భావం చెందుతుందని పూర్వ వ్యాఖ్యాతలున్నారు- అనువక్త)


No comments:

Post a Comment