Tuesday 16 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 162 వ భాగం



మన పురాణాలలో ఇచ్చిన రాజులు, వారి కాలం పుక్కిటి పురాణం క్రింద జమకట్టారు. ఇట్టి భావాలనే చరిత్ర పుస్తకాలలో వ్రాసి వ్యాప్తి చేసారు. చిన్నప్పటి నుండీ ఈ నాగరికత పై చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు.


పురాణాలలో రాజులు, వారి కాలాలు స్పష్టంగా ఉన్నాయి. ఈనాటి ముద్రణ సౌకర్యం ఆనాడు లేదు కనుక వ్రాతలలో కొన్ని పొరపాట్లు దొర్లి యుండవచ్చు. తులనాత్మక పరిశీలన చేసి అన్ని పాఠాలను పరిశీలించి ఒక నిర్ధారణకు రావచ్చు. సత్యాన్ని మనకు మనమే నిర్ధారణ చేసుకోగలం.


పురాణాలలో రాజవంశాలు పేర్కొనబడ్డాయి. ఇవి కాక కల్హణుడనే కాశ్మీర పండితుడు వేయి సంవత్సరాల వెనుక రాజ తరంగిణిని వ్రాసేడు. అందనేక రాజుల కథలున్నాయి. పురాణాల విషయాలు, ఇందు చెప్పినవి చూస్తే చాలా పోలికలున్నాయి. అట్లాగే నేపాల్ వంశ చరిత్ర ఉంది. ఇందు భారత కాలంనుండి వచ్చిన రాజవంశాలున్నాయి. పండిత భగవాన్ లాల్ ఇంద్రాజీ, ఒక బౌద్ధ భిక్షువునుండి ఈ గ్రంథాన్ని సంపాదించి ప్రచురించాడు. దీనికీ పురాణాల వివరాలకూ సంబంధం కన్పిస్తోంది. లంకలో మహావంశం అనే గ్రంథం ఉంది. 1500 సంవత్సరాల వెనుక నాటిదని ఆ దేశంలో బౌద్ధమత చరిత్రను చెబుతోంది. ఇట్లా అన్ని గ్రంథాలను పరిశీలిస్తే, ఎన్నో చారిత్రక విషయాలు తెలుస్తాయి. ప్రతి దానినీ కాకమ్మ కథగా కొట్టిపారవేయవలసిన అవసరం లేదు.


చరిత్రకారులు, ఎక్కడ తప్పటడుగుగు వేసారో చూడండి.


అలెగ్జాండర్ సైన్యాధిపతి, సెల్యూకస్, అతని తరువాత గ్రీసు దేశపు రాజయ్యాడు. అతడు మన మగధరాజు చేతిలో ఓడిపోయాడు. సంధి చేసుకున్నాడు. సెల్యూకస్, మొగస్థనీస్ అనే రాయబారిని పాటలీపుత్రానికి పంపాడు. ఈ రాయబారి తాను భారతదేశంలో చూసిన విషయాలను వ్రాసేడు.


No comments:

Post a Comment