Tuesday, 30 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 176వ భాగం



నోటితో తినడం అంటే కర్మానుభవాన్ని సూచిస్తుంది. కర్మ అనుకూలంగా లేనపుడు డబ్బు ఎట్లా వస్తుంది? కనుక అమ్మవారు కర్మయనే చిట్టావర్ణాలను చూడకుండా చాతకపక్షి నోటిలో వాన చినుకు పడేటట్లుగా కనకవర్షాన్ని కురిపించమంటున్నాడు. చిన్న చాతక పక్షి, ఆకలికి తట్టుకోలేదు. అట్లా వీరిని పోల్చారు. ఆవిడ అమ్మవారు, ఇది విహంగ శిశువు సరిపోయింది.


చాతక పక్షి ఆహారం కోసమే బాధపడుతుంది. కాని ఈ దంపతులనే పక్షులకు ఇల్లు, డబ్బు, వస్త్రాలు, మొదలైనవి అన్నీ కావాలి. కనుక వీరి గత జన్మ పాపాలను పోగొట్టి వీరిని కటాక్షింపుమమ్మా అని అడిగారు.


డబ్బునే ఎందుకడిగారు? భజగోవింద స్తోత్రంలో అర్థమనర్ధం అన్నారు. అయితే ఈ డబ్బును పరిమితంగా తెలివిగా వాడి, సత్కర్మలకుపయోగిస్తే ఇదీ ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. అన్ని స్తోత్రాలను ఈ లక్ష్యాన్నే దృష్టిలో పెట్టుకొని వ్రాసేరు. అన్నపూర్ణేశ్వరిస్తోత్రంలో భిక్షాం దేహి అంటూ చివరగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు. భక్తుల దారిద్ర్యాన్ని ప్రస్తావిస్తూ అట్టి దారిద్య్రంతో బాటు కర్మనుండి విముక్తి చేయమని ప్రార్థించారు.


కనకధారాస్తవం ఒక పాఠంలో 18 శ్లోకాలున్నాయి. కొన్నింటిలో 20-21 శ్లోకాలున్నాయి. ఈ శ్లోకంలోనే డబ్బును గురించి అడిగినట్లుంది. తరువాతి శ్లోకంలోనూ "ఇష్టాం పుష్టిం కృషీష్ట మమ" అని డబ్బును గురించి అడిగారు. మిగతా స్తోత్రం అంతా అయ్యవారిని, అమ్మవారిని అనుగ్రహం చూపించవలసిందిగా ఉంది. ఆయన నల్లని మేఘం ఐతే అతని వక్షఃస్థలంపై మెరుపుతీగలా ఉండే పరాశక్తిని స్తోత్రం చేసినట్లే ఉండి డబ్బు గురించి అడిగినట్లుంటుంది. తానెందుకు ఈ స్తోత్రం చేయవలసి వచ్చిందో కేవలం సూచనగా ఉంటుంది.


పై శ్లోకంలో కర్మను భక్తితో ముడిపెట్టారు. కర్మ తనంతట తాను ఫలాన్నియ్యదని, ఫలదాత ఈశ్వరుడని బోధిస్తున్నారు. కర్మనుండి భక్తికి మళ్ళిస్తున్నారు. ఇక భక్తి మార్గంలో ఉన్నవారికి నా దేవుడు, నీ దేవుడనే భేదభావం ఉండకూడదని నీ ఇష్టమూర్తిని మాత్రం కొలువుమని, అందరు దేవతలూ పరమాత్మ స్వరూపులుగానే చూడుమని హెచ్చరిక చేస్తున్నారు. అనగా భక్తి మార్గం నుండి జ్ఞానమార్గానికి మళ్ళిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ తరువాతి శ్లోకాన్ని చెబుతున్నారు.


No comments:

Post a Comment