ఇక చండికేశ్వరుడు పితృద్రోహి. అతడు కుండల కొద్దీ పాలను శివలింగంపై అభిషేకిస్తూ ఉండేవాడు. తండ్రి వచ్చి ఆ పాల చెంబును కాలితో తన్నాడు. వెంటనే చండికేశ్వరుడు తండ్రి కాళ్లను నరికి వేసాడు. ఇక నుండి నేను నీకు తండ్రినని శంకరుడన్నాడు. అంతకుపూర్వం అతని పేరు విచార శర్మ. తరువాత చండికేశ్వరుడయ్యాడు. శివుని పంచమూర్తులలో అనగా శివుడు, అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండీశ్వరులలో ఒకటి అయ్యాడు. ఇది ఏనాటి కథయో?
పైవారిలో చిరుతొండ నాయనార్ చారిత్రక వ్యక్తి. ఏడవ శతాబ్దానికి చెందినవాడు. ఇతణ్ణి శంకరులు ప్రశంసించారు కనుక ఇతని తరువాతనే శంకరులుండాలని చారిత్రకులు వాదన.
చారిత్రకులెత్తి చూపినవి:
సూత్రభాష్యంలో శంకరులు, సత్ నకు అసత్ నకు సంబంధం ఉండదని చెబుతూ పూర్ణవర్మ పట్టాభిషేకానికి ముందు గొడ్రాలి కొడుకు రాజుగా నున్నాడనుట అసంగతమనే అభిప్రాయంలో వాడారు. ఈ పూర్ణ వర్మ ఎవడు? ఇద్దరా పేర్లతోనున్నారు. జావా ద్వీపంలో నాల్గవ శతాబ్దానికి చెందిన పూర్ణవర్మ ఒకడు. శంకరులు పేర్కొన్న రాజు మగధను పాలించిన పూర్ణవర్మ అయి యుంటాడని అన్నారు. హ్యూయాన్ త్సాంగ్ అనే యాత్రికుడు ఏడవ శతాబ్దంలో మనదేశం వచ్చి మగధను పూర్ణవర్మ పరిపాలిస్తున్నాడని వ్రాసేడు.
బౌద్ధ మతానికి విరోధియైన శశాంకుడు గయలోని బోధి వృక్షాన్ని నరికాడని, పూర్ణవర్మ దానిని మరల ప్రతిష్ఠించాడని కథ. ఇతణ్ణి శంకరులు పేర్కొన్నారు కనుక ఏడవ శతాబ్దం తరువాత శంకరులు కాలమని చరిత్రకారుల వాదన.
అయితే చాలా కాలం వెనుకనే బౌద్ధం, హైందవ మతం మిగతా దేశాలలో వ్యాపించాయి. కాంబోడియా (కాంభోజ) లో ఒక శాసనంలో ఇంద్రవర్మ ప్రస్తానవ ఉంది. అతని గురువు, శివసోముడు. అతడు భగవత్ శంకరులనుండి శాస్త్రాలను నేర్చుకున్నట్లుంది. "యేనాధీతాని శాస్త్రాణి శంకరాహ్వయతః" వారు శంకరులే అని చారిత్రకులున్నారు. ఇంద్రవర్మ కాలం తొమ్మిదవ శతాబ్దానికి చెందింది. అతని గురువు 30 లేక 40 సంవత్సరాల పెద్దవాడై యుంటాడు. కనుక శంకరుల సమకాలికుడే కనుక శంకరులు 788-820కి చెందినవారని తీర్పునిచ్చారు.
No comments:
Post a Comment