Monday 15 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 161 వ భాగం



పాశ్చాత్య చరిత్రకారుల లక్ష్యం మనను కించపరచడమే


పాశ్చాత్య చరిత్రకారులు మన కాలగణనను చెత్తబుట్టలో వేస్తారు. మన సంకల్పంలో, ఏ కల్పంలో, ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, ఏ సంవత్సరంలో, ఏ రోజులో ఆ వేళ ఉన్నామో చెప్పుకుంటాం.


అనాది నుండి ఈ సంస్కృతి సాగుతోంది. పాశ్చాత్యులు రెండువేల సంవత్సరాల నుండి కన్ను తెరిచారు. ఇదంతా క్రీస్తు తరువాతనే, వారి భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రగతిని కాదనం, కించపరచడం లేదు. అయితే తమకంటే పూర్వమే గొప్ప నాగరికతలున్నాయని వారంగీకరించకపోవడం వల్ల చరిత్రలోని లెక్కలు తారుమారయ్యాయి. ఇంకా మనం వర్ణ భేదాలతో కొట్టుకుంటున్నామని, అనాగరికులమని వారిలో ఒక దృఢ భావన ఏర్పడి వీరికి చరిత్ర పాఠాలు చెప్పాలనుకున్నారు. భారతీయ పూర్వపుటౌన్నత్యాన్ని జీర్ణించుకోలేక పోయారు. కాలాన్ని ఎంత తక్కువగా కుదించి చూపితే అదే మేలని భావించారు. మన శాస్త్రాలు, వేదాలు, కళలు, విద్యలను గుర్తించలేదు. మన విద్యల పట్ల ఏవగింపు కలిగేటట్లుగా పథకాలు పన్నారు. ఆర్యద్రావిడ భేదాలను కల్పించారు.


ఎట్లా మనలో ఏవగింపు కల్గించాలి? వర్ణాశ్రమాలను, వేదాన్ని కాదనిన బుద్ధుణ్ణి కీర్తించి భారతీయ చరిత్ర అంతా ఇతనితోనే ఆరంభమైనదని చిత్రీకరించారు. రాముడు, కృష్ణుడు మొదలైనవారు ఏవో కథలలో నాయకులని, చారిత్రక వ్యక్తులు కారని నమ్మబలికారు. ఇక అద్వైతం కూడా, బౌద్ధం నుండే వచ్చిందని, శయనిస్తున్నట్లున్న విష్ణు విగ్రహం కూడా బుద్ధుని మహా నిర్వాణంలో ఉన్న శిల్పం మాదిరిగానే ఉంటుందని ప్రచారం చేసారు.


వేదాలు, మహా అయితే బుద్ధునికి ముందు ఏ ఐదు వందల సంవత్సరాలనుండో వచ్చాయని, దానికంటే ముందు హరప్పా నాగరికత యుండేదని, అది ద్రావిడ నాగరికతయై యుంటుందని, హరప్పాలోని వారిని తరిమివేసి ద్రావిడ సంస్కృతినుండి నేర్చుకుని వైదిక నాగరికత వచ్చిందని వ్రాసేరు.


No comments:

Post a Comment