Wednesday 3 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 151 వ భాగం



కంచితో ప్రత్యేక సంబంధం


కంచి ప్రాంతంలో ఆచార్యుల విగ్రహాలు చాలాచోట్ల ఉన్నాయి. కామాక్షి ఆలయంలో వీరి మూర్తి ఉంది. అట్లాగే ఏకామ్రనాథుడు, వైకుంఠ పెరుమాళ్, వరదరాజు ఆలయాలలో వీరి మూర్తి ఉంది. ముఖ్యంగా తాయారు సన్నిధికి వెళ్ళే మార్గంలో వ్యాసునితో కూడిన శంకర విగ్రహం, అక్కడ వ్యాసుడు, అద్వైతమే సత్యమని వేలెత్తి చూపిస్తున్నట్లున్న విగ్రహం, ఒక స్తంభంపై మలచబడింది.


కామాక్షి అమ్మవారు ఉగ్రమూర్తిగా ఉండగా శంకరులు ఆమెను సౌమ్యమూర్తిగా తీర్చిదిద్దారు కనుక, అమ్మవారితో శంకరులకు ప్రత్యేక సంబంధం ఏర్పడింది. దీనికి అనుగుణంగా తపః కామాక్షి విగ్రహాలు ఏ విధమైన భంగిమలలో ఉంటాయో అదేవిధమైన ముద్రలు భంగిమలతో ఆచార్యులవారి విగ్రహాలు కొన్ని గుళ్ళల్లో చూపబడినాయి.


శంకరులు శిష్యచతుష్టయంతో ఉన్నట్లు ప్రసిద్ధియైనా కంచిలో ఆచార్యులవారి నివాసాన్ని తెలిపే పుస్తకాలు, అర్గురు శిష్యుల గురించి చెబుతాయి. ఆచార్యులవారి ఆదేశంతో షణ్మతములను స్థాపించిన ఆర్గురు శిష్యులు, తమ తుది సంవత్సరములలో ఆచార్యులవారు కాంచీపురంలో విడిది చేసి ఉండగా వచ్చి వారికి నివేదించారని ఆ పుస్తకాలు చెబుతాయి. దీనికి తగినట్లుగా కామాక్షి దేవాలయంలోని ఆదిశంకర మూర్తి పీఠంపై నల్గురు శిష్యులకు బదులుగా ఆరుగురు శిష్యులను చూడవచ్చు. కంచి మఠం పూజాగృహంలో కూడా రెండు ప్రక్కలా ముగ్గురేసి శిష్యులున్న ఆచార్యుల వారి మూర్తి ఉన్నది.


కంచి చుట్టుపక్కల చెన్నైవరకు అక్కడక్కడ వీరి మూర్తులున్నాయి. అంత్య సమయంలో వీరు కంచిలో ఉండడం వల్ల అట్లా మూర్తి ప్రతిష్టాపన జరిగియుండవచ్చు.


No comments:

Post a Comment