Wednesday 24 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 170 వ భాగం



నిత్య కర్మల వల్ల ఆత్మశక్తి వృద్ధి పొందుతుంది. సత్యం పలకడం వల్ల లాభం కనిపిస్తోందా? అసత్యం పలకడం వల్ల లాభాలు కన్పిస్తున్నాయి. అయితే సత్యాన్నే ఎందుకు పలకాలన్నారు? పాపభూయిష్టుడవుతున్నావు కనుక కూడదన్నారు. అట్లాగే నిత్య కర్మల విషయంలోనూ, నిత్య కర్మల వల్ల (సంధ్యావందనం మొదలైనవి) ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. దాని ఫలాన్ని చూడలేం. ప్రత్యక్షఫలం అంటూ కనబడదు. ఒక కోరికతో చేసేవాటిని కామ్య* కర్మలని అంటారు. 'దశరథుడు, పుత్రుని కోసం పుత్రకామేష్టి చేసాడు. వాటిని విధిగా చేయాలని లేదు. నిత్య కర్మల వల్ల ఫలం ప్రత్యక్షంగా కనబడక పోయినా, చేయకపోతే పాపమన్నారు.


ఉపనయనం సకాలంలో చేయలేకపోతే 16 సంవత్సరాల వరకూ చేయవచ్చని అన్నారు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు 11 నుండి 22 వరకు; వైశ్యులకు 12 నుండి 24 వరకు ఉపనయనం చెయ్యవచ్చని ఉంది. అంతకంటే మించకూడదు. ఈనాడు దీనిని గుర్తించకపోవడం దురదృష్టకరం.


కామం, మనస్సులో చొరబడని కాలంలోనే రోజూ వేయిసార్లు గాయత్రిని చేస్తే చిత్తశుద్ధి ఏర్పడి, తద్వారా లోక కల్యాణము జరుగుతుంది. అట్టిది సకాలంలో చేయకపోతే తండ్రికి పాపం చుట్టుకోదా? 8 నుండి 16 వరకూ ఉన్నదానిని గౌణకాలం అంటారు. 7వ ఏట చేయడం ముఖ్య కాలం అంటారు. గౌణకాలం కూడా దాటితే వ్రాత్యుడని అన్నారు. అనగా జాతినుండి వెలివేయదగినవాడని ఘాటుగా చెప్పారు.


ఉద్యోగానికి వయః పరిమితి దాటకూడదంటే దొంగ సర్టిఫికెట్లు పుట్టించైనా తొందర పడుతున్నాం కదా! అట్లా ఉంటే నిత్య కర్మల విషయంలో జాగరూకత ఉండవద్దా?


అందువల్ల పూర్వులు కామ్యోపనయనాన్ని ఐదవ యేటనే చేయవచ్చని అన్నారు. "బ్రహ్మవర్చస్య కామః పంచమే" అని స్మృతి వాక్యం. మామూలు చేసే కామ్య కర్మ కాదది. బ్రహ్మ వర్చస్సును కోరి చేసేది.


అట్టివాడు, అధర్మకృత్యాలు చేయడానికే ముందుకు రాదు. గాయత్రి, అట్టివాని బుద్ధిని బాగా పదును పెడుతుంది. శంకరుల వంటి వారికి దివ్య శక్తులున్నా చీటికీ, మాటికీ చూపించరు. అవసరం వచ్చినపుడు చూపిస్తారు. మామూలు వ్యక్తుల లాగానే కన్పిస్తారు.


No comments:

Post a Comment