మనస్సుకి నచ్చిన ఆ సుందరాంగితో పేరుకి తగిన ఆ సుశీలతో కలిసి హాయిగా గాంధర్వవేదం పాడుకుంటూ కాలానుగుణంగా అభిరుచికి అనుగుణంగా సుఖసంతోషాలు అనుభవిస్తున్నాడు. వాటి అంచులు రుచి చూస్తున్నాడు. సంవత్సరాలు రోజులుగా దొర్లిపోతున్నాయి. చివరకు కాలధర్మం చెందారు. కానీ తాము ఉపాసించిన గాంధర్వ కామశాస్త్రాల మహిమ వల్ల అతడు గంధర్వుడుగా ఆమె గంధర్వ కన్యగా గంధర్వ లోకంలో పునర్జన్మలు పొందారు. అక్కడా దంపతులయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లుగా భోగాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకనాడు కైలాసానికి దగ్గరలో వున్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కనిపించారు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. నాదవేత్త అయిన గంధర్వుడు మంజుల స్వరం విప్పి మెల్లగా ఆదిదంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వసుందరి వీణ మీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నాదజ్ఞుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమగీతాన్ని సంగీతాన్ని నేనెప్పుడు వినలేదు. గంధర్వుడా నువ్వు ధన్యుడవు, కృతకృత్యుడవు. నువ్వూ, నీ భార్యా ఇంద్రలోకం వెళ్ళండి ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు. గంధర్వ దంపతులు ఆనందంతో మరింతగా స్తుతించారు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు (సుశీలా విశాలాక్షులు) ఇంద్రలోకం చేరుకొన్నారు. అక్కడ నందనవన సీమలలో ఇంద్రాది దేవతలను తమ తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపచేస్తూ తాము రంజిల్లుతున్నారు. ఇలా వుండగా ఒక రోజున దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళవలసి వచ్చింది. సరస్వతీ చతుర్ముఖుల సమక్షంలో పేరోలగం సాగుతోంది. ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులను (సుశీలా విశాలాక్షులు) తీసుకెళ్ళాడు. ఆ మహోత్సవంలో అప్సరసలు అందరూ ఆడారు పాడారు. వీణా వేణు మృదంగాలు శృతిపేయంగా వినిపిస్తున్నాయి. దేవగాయకులు దివ్యగానామృతాన్ని పంచుతున్నారు. బ్రహ్మనుగ్రహం కోసం వీణాపాణి మెప్పు కోసం ఎవరిమటుకు వారే తమ ప్రతిభావ్యుత్పత్తులను అపరిమితంగా ప్రదర్శిస్తున్నారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల గాంధర్వ విద్య గురించి విరించికి సూచించాడు. గళం విప్పండి అని వీరికి కనుసైగ చేశారు. తక్కినవారి సంగీత నృత్యాలను చేతిసంజ్ఞతో నిలుపుదల చేశారు. అప్పుడు సుశీల, విశాలాక్ష దంపతులు గొంతు సవరించారు. నారదతుంబురలకు సైతం అన్నప్పుడే లభించని సువర్ణావకాశం తమకు లభించటంతో ఇద్దరూ మైమరచి తమ గాన కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. విభిన్నస్థాయిలలో వివిధ రాగాలను యథాశాస్త్రంగా ఆలపించారు. వాణీ చతుర్ముఖులను స్తుతించే కీర్తనలు గానం చేశారు. సంగీత సరస్వతి తానై ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించటానికి ఆ వాగ్దేవతకు కూడా మాటలు చాలలేదు. బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పులకించిపోయాడు. ఎనిమిది కన్నుల నుంచీ ఆనందాశ్రువులు జాలువారాయి. చాలాసేపటికి తేరుకున్నాడు. విశాలాక్షా! నువ్వు నాదబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవి ఇస్తున్నాను. ఇక నుంచి మీ నివాసం ఇక్కడే, ఈ సత్యలోకంలోనే, మాతో పాటే ఆనందించండి. వేదగోచరమైన బ్రహ్మతత్వాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయమూ, సచ్చిదానందమూ అయిన పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. ఇంద్రా! ఇతివృత్తం (యథార్థంగా జరిగిన కథ) విన్నావుగా. ఇప్పుడేమంటావ్! కామగాంధర్వశాస్త్రాలు అంతర్భహిర శుద్ధిని కలిగిస్తాయని ఒప్పుకుంటావా?