Sunday 23 April 2023

శ్రీదత్త పురాణము (117)

 


పరాత్పరా నిజంగా నేను మందబుద్ధిని. రాజభోగాలలో తల వరకు మునిగాను. అవి నశ్వరాలని దుఃఖహేతువులని గ్రహించలేకపోయాను. ఇప్పటికి కళ్ళు తెరిచాను. నాకు ఈ రాజ్యాలు వద్దు, భోగాలు వద్దు. నీ పాద రేణువుననుగ్రహించు. సిద్ధులైనవారు ఈ జగత్తు మిధ్య అంటారు. మనోభ్రమ వల్ల సత్యంలాగా కనబడుతుంది అంటారు. నిజంగా ఇదంతా వట్టి మిధ్యే అయితే ఇది ఇంత ఖచ్ఛితంగా సత్యంలాగా కన్పించటం సంభవమేనా? నిన్ను శరణు పొందాను. నా సందేహాన్ని తీర్చి అచ్చమైన తెలివిని కలిగించి ధన్యున్ని చెయ్యి - భయనివారకా! ఈ సంసారం అనే మొసలికి భయపడినంతగా నేను మరి ఇంక ఏ శత్రువుకూ, ఏ భూతానికీ, ఆఖరికి మృతువుకు కూడా భయపడను. అందుకే రాజ్యవైభవాలన్నీ వదిలేసి నీ చరణ సన్నిధికి వచ్చాను. నీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నా భవభయం తొలగించు, సత్యము, శాశ్వతమూ అయిన సుఖం కలిగించు. తాపత్రయంలో మాడిపోతున్న నాకు నీ అనుృతమయమైన వాక్కులతో ఉపశమనం కలిగించి, సేద తీర్చు. విశ్వాత్మా, విశ్వేశా, నీపాదాలకు నమస్సులు యోగమార్గానుకూలురు కర్మబంధాలు తెంచుకుని యోగసిద్ధిలో ఏ పరతత్వాన్ని చూస్తున్నారో అది నువ్వే. అలాంటి నీపాదాలకు వందనములు, ఇంద్రియాలను తృప్తిపరచటం కోసం సుఖానుభూతితో పాపజలంలోపడ్డాను. ఎన్నో ఏళ్ళు గతించాయి. ఒడ్డూ దారి కనిపించటం లేదు.


ఈ మనస్సుకి ఎన్నటికీ ఏవగింపు కలగడం లేదు. ఇదేమి దురదృష్టమో మహారాక్షసులు చివరికి పశుపక్ష్యాదులు కూడా సత్సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానం పొంది సంసార సముద్రాన్ని దాటగలిగారు. నేనో? క్షత్రియవంశంలో పుట్టి ఎంతోకాలం నీ సేవజేసి, రాజభోగాల లంపటంలో పడి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతయినా బంధ విముక్తుణ్ని కాలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాజ్యసంపదలలో పిచ్చివాళ్ళయి మిధ్యావిలాసాల్లో మిధ్యాసుఖాల్లో తగుల్కొన్నాను. ఎట్టెదుట కాపువేసి వున్న మృత్యువును పసిగట్టలేకపోయాను. నాకన్నా మందమతి ఇంకెవరైనా వుంటారా? నువ్వే జాలిపడి కరుణించాలి. నీ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింపజెయ్యాలి. అది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ కోరను. నాకు శాంతిని ప్రసాదించే మార్గం ఇదొక్కటే. సకల సృష్టికీ నువ్వు సౌర్వభౌముణ్ని చేస్తానన్నా ఇంద్ర పదవి కట్టబెడతానన్నా చివరకు పరమేష్టిని చేస్తానన్నా నాకు వద్దు. వాటిలో సుఖం లేదని తెలిసిపోయింది.


ఆర్తి హరా! జగదీశ్వరా! నీ ఉపదేశమనే కొడవలితో నాలోని అహంకార గ్రంథిని మొదలంటా నరుకు. విశుద్ధ విజ్ఞానఘనా! సదానందా! లీలావిగ్రహ శరీరా! పురాణ పురుషా! నమోనమః నమోనమః పద్మనాభా! అజ్ఞానంలో పడి నీ పాదపద్మాలను సేవించని వాళ్ళని సైతం ఉద్ధరించటానికి అవతరించిన దయామయుడవు అని పెద్దలు చెబుతున్నారు. అలాంటిది నీ పాదధూళిని శిరసా వహించిన నాబోటి వారికి నీ దయ అనుభవంలోకి రాకపోవటం, ఇంకా భవరోగులమై బాధపడటం వింతగా ఉంది. అనసూయా అత్రి మహర్షుల తపస్సుకి మెచ్చి వారికి పుత్రుడుగా నిన్ను నువ్వు దత్తం చేసుకున్నావు. అలా దత్తదేవుడవయ్యావు, అంతటి దయాళుడవూ అంతటిదాతవూ ఎందుకో మరి నా మొర ఆలకించటం లేదు.


No comments:

Post a Comment