Friday 21 April 2023

శ్రీదత్త పురాణము (115)

 


శౌనకాదిమునులారా! గురుసేవాపరాయణుడూ, ఉత్తమభక్తుడూ అయిన శిష్యుడు దీపకుడు. వేదధర్ములవారికి పాదాభివందనం చేసి ఏమి అడిగాడో దానికి ఆ గురువుగారు ఏమి చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వినిపించాడు. దాన్ని మీకు నేను వినిపిస్తాను అంటూ సూతమహర్షి ఇలా చెప్తున్నాడు.


గురుదేవా! చిదానందమహోదది అయిన శ్రీమన్నారాయణుడి లీలావతార చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనస్సు కుతూహలపడుతోంది. శ్రుతి, స్మృతి, పురాణాల్లో మహర్షులచేత కీర్తింపబడిన ఆ రహస్యాలను శ్రద్ధతో వింటున్న నాకు దయచేసి ఎరుకపర్చండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టుబొట్టుగా స్వీకరించి పొట్టనింపుకున్నట్లు దత్తమహిమలు సేకరించి నా గుండెలు నింపండి. ఈ దత్తమహిమలు విన్నవాడెవడూ గర్భావాసక్లేశాన్ని పొందడుగాక పొందడు.


దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడ్డాడు వేదధర్ముడు. బిడ్డా దీపకా సమస్త పురాణాల సారాన్ని బొట్టు బొట్టుగా స్వీకరించి దత్తకథగా నీకు మొత్తం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించు.


యోగులకు పరమగురువూ, జ్ఞానవిజ్ఞానాల పెన్నిధీ, విశ్వవంద్య పదాంభోజుడూ, జగదీశ్వరుడూ, అత్యంత సుందరమైన పురుషశరీరం ధరించినవాడూ అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యపర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకొని ధ్యాననిమగ్నుడై నిశ్చలంగా నిష్టగా కూర్చుని వున్నాడు. ఈ దత్తదేవుడ్ని దర్శించాలనే కోరిక కలిగి మాహిష్మతీపురం అధిపతి, కృతవీర్యుని కుమారుడు, యోగవిద్యాప్రవీణుడు, సహస్ర బాహువులు కలవాడు, మహాతేజస్వీ అయిన కార్తవీర్యార్జునుడు ధనుర్ధారియై మరొక దేవేంద్రుడిలా సహ్యాద్రికి వచ్చాడు.


అనేకరకాలైన అమృతమయమైన ఫలవృక్షములతో అద్భుత సువాసనలు అందిస్తున్న అనేకానేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా వున్నది ఆ ప్రాంతం అంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభప్రదంగా నిలువెల్లా చిగురించి గుబురుగా ఎదిగిన గున్నమావిచెట్టు మొదట పద్మాసనం వేసుకుని చిన్ముద్రలు ధరించి కన్నులు మూసుకొని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయస్వామిని దర్శించి దత్తపాదస్పర్శతో పునీతం అయిన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో, ఒక్క ఉదుటున సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే వుండి మాటిమాటికి తలపైకెత్తి చూసాడు. ఆనందంతో మరల మరల నమస్కరించాడు. దత్తస్వామి ధ్యాననిష్టలోనే వున్నాడు. కార్తవీర్యార్జునుడు తన వెయ్యి చేతులను సంకల్పించి రప్పించి వెయ్యిచేతులతో రకరకాల వాయిద్యాలను మోగిస్తూ ఆడుతూ పాడుతూ దత్తస్వామిని సేవించాడు. ప్రొద్దుగూకింది. రాత్రి గడిచింది. తెల్లవారింది. అతడి నృత్యగీతసేన కొనసాగుతూనే వుంది. కానీ జగత్పతి మాత్రం ధ్యానం వదలేదు. కన్నులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతుండగా కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించాడు.


No comments:

Post a Comment