Tuesday 4 April 2023

శ్రీదత్త పురాణము (99)

 


పంచవేదాలలోనూ పురాణేతిహాసాదిశాస్త్రాలలోనూ ఉన్న విషయాలు సమస్తం వివిధ కళాశిల్ప రహస్యాలు యోగికి కరతలామలకములు అవుతాయి. ఆప్రయత్నంగానే స్ఫురిస్తాయి. దీనినే ప్రాతిభం అంటారు. వేలకొలదీ యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్య పశుపక్ష్యాదుల స్వరాలు శబ్దాలు వాటి అర్ధాలు ఇతడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అంటారు. దేవ, పితృ, సిద్ధ, సాధ్యాది, అష్టవిధ దేవగణాలు ఇతడికి కనిపిస్తారు. దీన్ని దైవము అంటారు. నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వల్ల పరిభ్రమింపగలుగుతాడు. ఈ శక్తిని భ్రమం అంటారు. సుడిగుండంలో నీళ్ళు తిరుగుతున్నట్లు యోగి హృదయంలో సమస్త జ్ఞానమూ సుళ్ళు తిరుగుతూ అతడిని అల్లకల్లోలం చేస్తుంది. ఈ శక్తిని ఆవర్తం అంటారు.


ఇవేకాదు. ఇంకా భయంకరమైన ఉపసర్గలు ఒక దాని వెంట ఒకటిగా జయించిన కొద్దీ వస్తూనే వుంటాయి. యోగిని ఊరిస్తూనే ఉంటాయి. వీటికి లొంగిపోక ప్రదర్శనలకు దిగక నిలువరించుకోవటం చాలా అవసరం. మనోమయమైన ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ చిత్తాన్నితత్ప్రణం చెయ్యడం ఒక్కటే వీటిని జయించే మార్గం. ఇలా విఘ్నాలను దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి.


అలర్కా! ఇప్పుడు నీవు ధారణా సప్తకం గురించి తెలుసుకోవాలి. నియమితాహారుడూ, జితేంద్రియుడు అయిన యోగి మూర్ధభాగంలో ధరిత్రిని ధారణ చెయ్యాలి, దాని సూక్ష్మత్వం పొందాలి, అనగా ధరీత్రిత్వం పొందాలి. దాని గుణమైన గంధాన్ని తానే వదలాలి. ఇలాగే వరుసగా పంచభూతాలనూ ధారణజేసి తత్తన్మయుడు అవుతూ తత్తద్గుణాలను తానుగా వదలాలి. ఆపైన తన మనోబుద్ధులను సర్వభూతా మనోబుద్ధులతో కలిపి వాటి సూక్ష్మత్వాలను విడిచిపెట్టాలి. ఇలా ఏడు వృత్తులనూ విడిచి యోగి తాను ప్రవృత్తిరహితుడై ముక్తిపొందాలి. సృష్టి అంతా ఏడు వృత్తులలోనే ఉంది కాబట్టి దీన్ని అభ్యసించిన యోగి దేవాసుర గంధర్వాదుల దేహాలలో ప్రవేశించిన సంగరహితుడుగానే ఉండగలుగుతాడు. ఇతడినే శుద్ధాత్ముడు యోగ సిద్ధుడు అంటారు. ఇతనికి అణిమాది అప్లైశ్వర్యాలూ సిద్ధిస్తాయి. ఇవి ముక్తికి సూచకాలు.


No comments:

Post a Comment