Thursday 6 April 2023

శ్రీదత్త పురాణము (101)



ఇటువంటి యోగి చర్చలు ఎలా వుంటాయి చెప్పమని అలర్కుడు అడిగాడు. దానికి దత్తాత్రేయుడు అంగీకరించి ఇలా చెప్తున్నాడు. అలర్కా మానవమానాలు మానవులందర్కి ఆనందాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి. యోగి విషయంలో ఇవి విపరీతం. అంటే మానంవల్ల దుఃఖం, అవమానం వల్ల ఆనందం పొందుతాడు. ఇతడికి మొదటిది విషం, రెండవది అమృతం.


ఇతడి దినచర్యకు చాలా నియమాలు వున్నాయి. చక్షుపూతమైన ప్రదేశంలోనే అడుగుపెట్టాలి. వస్త్రపూతమైన జలమే త్రాగాలి. సత్యపూతమైన వాక్కునే పలకాలి. బుద్ధి పూతమైన దానినే ధ్యానించాలి. ఆతిధ్యాలకు, శ్రాద్ధ భోజనాలకు, దేవతల ఊరేగింపులకూ, ఉత్సవాలకు, జనసమ్మర్ధం కోలాహలం ఎక్కువగా వుండే ప్రదేశాలకు యోగసిద్ధ్యర్ధి వెళ్ళరాదు. ఆ ఇంటిలో అందరి భోజనాలు అయినాక అది నిర్ధారించుకొని ప్రశాంతంగా వున్న ఇంటికి తాను వెళ్ళి భిక్ష అడగాలి. పొగలు గ్రక్కుతున్న ఇంటి నుండి గాని, బొగ్గులు గుమ్మంలో ఆరబోసిన ఇంటి నుండి గాని బిక్ష యాచించరాదు. రోజూ ఒకే ఇళ్ళకు బిక్షకు వెళ్ళరాదు. జనం తనను చూసి అవమానించే వేషధారణలో సంచరించాలి. సజ్జన ధర్మాన్ని తప్పరాదు. యాయవారుల ఇండ్లకు, గృహస్థుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసికోవాలి. యాచకుల ఇండ్లకు ఇంకా తక్కినవారి ఇండ్లకు భిక్షకు వెళ్ళడం అంతశ్రేయస్కరం కాదు.


యోగికి బియ్యపుజావ, మజ్జిగ, పాలు, యవల జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకల అన్నం, ఇవి శుభం కలిగించే ఆహారాలు, యోగసిద్ధికరాలు. మౌనంగా కూర్చుని ఏకాగ్రచిత్తంతో భుజించాలి. ముందుగా కొంచెం నీళ్ళు త్రాగాలి. అటు తర్వాత పంచ ప్రాణహుతులతో భుజించాలి. అనగా ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, సమానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, వ్యానాయస్వాహా అంటూ అయిదు మార్లు మెతుకులు గోటితో వేసుకుని ఆ తర్వాత భుజించాలి. 

చివరలో మళ్ళీ మంచి నీరు పుచ్చుకొని ఆచమించాలి. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఓసారి హృదయంపై చేయివేసి స్పృసించాలి.


No comments:

Post a Comment