Thursday 27 April 2023

శ్రీదత్త పురాణము (121)

 


గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యుడికీ కలిగాయి. వీటికి దత్తస్వామి ఏమి సమాధానం చెప్పారో తెలుసుకోవాలని మనస్సు ఉబలాటపడుతోంది. తరువాత కథను సెలవియ్యండి అని దీపకుడు తొందర చేసాడు. వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు.


కార్తవీర్యార్జునుడు అడిగిన సందేహాలకు అక్కడ సమావేశమైన మునులందరూ వింటూ వుండగా దత్తస్వామి ఇలా సమాధానం చెప్పాడు. కార్తవీర్యా! నీ విజ్ఞాపనం- నీ వాంఛితం నీ ప్రశ్నలు నాకు నచ్చాయి. నువ్వు చేసిన స్తోత్రం ఇంకా నచ్చింది. సమాధినిష్టలో వున్నా దివ్యశక్తితో అంతాచూసాను. ముందే గ్రహించాను. నీ విజ్ఞాపనలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం చెబుతాను, ముక్తిని అందిస్తాను. మహా బాహా! బాధపడకు దుఃఖం విడిచిపెట్టు. నువ్వు నన్ను వశపరుచుకున్నావు. నా భక్తుడికి ఈ లోకంలో ఏదీ దుర్లభం అంటూ వుండదు. నువ్వు చేసిన స్తోత్రము అతి పురాతనమైనది. నా తత్వమూ రహస్యమూ అన్నింటినీ అందులో దాచి వుంచాను. నీ ముఖతః అది ఇప్పుడు లోకానికి వెల్లడి అయ్యేలా చేసాను. లోకోపకారం కోసం ఇలా చేసాను. దీన్ని ప్రాతఃకాలంలో పఠించిన వారు, నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు.


వేదశాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు వున్నాయని బుద్ధిమంతుడవై చాలా మంచి ప్రశ్న వేశావు, అది కేవలం బుద్ధిహీనుల ఆక్షేపణ మాత్రమే. ముందు నీ సందేహాల్ని తొలగించి ఆ తర్వాత సప్రమాణంగా మోక్ష విద్య తెలుపుతాను. ఎందుకంటే సందేహాలు తొలగనిదే ఏది చెప్పినా నిరర్ధకం. ఈ సందర్భంగా నీకొక గాధ చెబుతాను. దీన్ని పూర్వ కాలంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. ఇందులో నీ సందేహాలకు సమాధానాలుగా ఏడు ఉదాహరణలు దొరుకుతాయి.


ఇంద్ర - బృహస్పతి సంవాదం - సప్తోదాహరణలు - వాస్తుశాస్త్రం - శిల్పశాస్త్రం జ్యోతిష్యం -


ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి తన మనస్సులో ఏదో వుంచుకొని బహుశా రాక్షసుల్ని సమ్మోహపరచటానికి కావచ్చు కామశాస్త్రం- దండనీతి శాస్త్రం, వాస్తుశాస్త్రం- శిల్పశాస్త్రం- సమగ్రంగా రచించి యోగ్యులు, బుద్ధిమంతులూ అయిన శిష్యులకి స్వయంగా బోధించటం ప్రారంభించాడు. ఇంద్రుడు ఇది గమనించి ఒకనాడు బృహస్పతి ఇంటికి వచ్చి పాదాభివందనం చేసి గురుదేవా తమరు ఏమీ అనుకోనంటే నాదో సందేహం అంటూ మొదలు పెట్టాడు. గురువర్యా! ఆత్మతత్వ విచక్షణా! లౌకిక సాధారణ పండితుల్లా సర్వజ్ఞులైన మీరు కూడా ఇలా చెయ్యడం భావ్యమా? తత్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను ఎందుకు రచించారు? మానవుల్ని ఇంకా సమ్మోహనపరచటానికి, విషయవాంఛల్లో ముంచటానికి తప్ప ఇవి ఇక ఎందుకు ఉపకరిస్తాయి? జీవి అసలు పుట్టుకతోనే రాగలంపటుడు అవుతున్నాడు. ఇది తెలిసిన పండితుడు- శాస్త్రకర్త - ఏమి చెయ్యాలి? ఉద్ధరించాలా లేక గ్రుడ్డివాణ్ణి నూతిలోకి నెట్టేసినట్టుగా ఇంకా చెడగొట్టాలా? గురుదేవా ఏ ఫలాన్ని ఆశించి తమరు ఈ పనిచేసారో గానీ నాకు మాత్రం ఉచితంగా తోచటం లేదు. మరి ఇందులో ఇంకా ఏదైన పరమార్థం, మహారహస్యం ఉంటే, అది నేను తెలుసుకోదగినది అయితే దయ చేసి వివరించండి అన్నాడు ఇంద్రుడు.


No comments:

Post a Comment