Saturday 29 April 2023

శ్రీదత్త పురాణము (123)

 


లలిత కళాశాస్త్రం - కామశాస్త్రం


ఇంద్రా మాహిష్మతీ నగరంలో విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు వుండేవాడు. పేరుకు తగ్గట్లే పెద్ద పెద్ద కన్నులతో కోటేరులాంటి ముక్కుతో బంగారు రంగు వంటి దేహంతో ఆకట్టుకొనే ముఖవర్చస్సుతో మరొక మన్మధుడిలా వుండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట నేర్పరితనమూ వుంది. చక్కగా పాడేవాడు, అడేవాడు, కవిత్వం చెబుతాడు. అన్నింటిని మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట. ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యను వరించాలనే తపనతో తానే స్వయంగా కన్యను అన్వేషిస్తూ దేశదేశాలు తిరుగువారంభించాడు. ఒకానొక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకుని అక్కడకు వెళ్ళి రాజుగారికి తనని తాను పరిచయం చేసుకొని, తను కన్య లక్షణాలు చూసి వరుడి వివరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోకి తీసికెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు. విశాలాక్షుని సౌందర్యానికి ఆకర్షితురాలైన రాకుమారి అతడినే వివాహమాడతానని తల్లిదండ్రులకు ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసి వెంటనే విశాలాక్షునికి శీతలోపచారాలు చేసింది. అతడు తేరుకున్నాడు. రాజు ఇద్దరికి ఓ సుముహూర్తాన ఘనంగా వివాహం జరిపాడు. బంగారు దివ్యాభరణాలు, దాసదాసీ జనం, అన్నీ సమృద్ధిగా బహూకరించి రాజు చివరకు తన రాజ్యంలో కొంతభాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి ధారపోశాడు.


సౌందర్యంలో అనురాగంలో పరస్పరం ఒకరినొకరు పుణికిపుచ్చుకొన్న సుశీలా విశాలాక్షి దంపతులు రాజభవనంలో హంస తూలికా తల్పాల మీదా, సరోవరాలలో, ఉద్యానవనాల్లో, కేళీ విలాసంతో హయిగా దాంపత్యసుఖాలు అనుభవిస్తున్నారు. కామశాస్త్రకుశలుడు అయిన విశాలాక్షుడు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. మానుషానందం - రాజానందం - సార్వభౌమానందం - దేవేంద్రానందం - చివరికి బ్రహ్మానందం కూడా అతడు పొందే ఆనందానికి సాటి రావటం లేదు. సత్యమూ, నిత్యమూ, అవాఙ్మనసగోచరమూ అయిన ఆనందానుభూతిని పొందుతున్నాడు. అలాంటి ఆనందానుభూతినే రాకుమారి సుశీలకూ అందిస్తున్నాడు. ఎలాగైనా మరోప్రాణికి సంతోషం - ఆనందం కలిగించాలట. ఇది బుద్ధిమంతుల లక్షణం అట. ఇంతకుమించిన ఈశ్వరార్చన లేదట.


అలాగని ఇంతటితో సంతృప్తి చెందలేదు ఈ విశాలాక్షుడు. ఆ సౌందర్యరాశితో కలిసి యధాశాస్త్రంగా ధర్మ అర్ధ కామ పురుషార్ధాలను మూడింటినీ పుష్కలంగా పండించుకుంటున్నాడు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేసి కృతకృత్యుడయ్యాడు. ధనలోభం లేకుండా యజ్ఞయాగాలు చేసాడు. దానధర్మాలు చేసాడు. చిన్నపాపంగాని, కొంచెం దుఃఖంగాని అతడు చేయలేదు పొందలేదు. ఆపదలే అతడు వినలేదు.


No comments:

Post a Comment