Saturday 15 April 2023

శ్రీదత్త పురాణము (109)

 


మావాడికి దుఃఖం కలిగింది. అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుడి కృపవల్ల సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. నా కోరిక నెరవేరింది. మరింక నాకు శలవు. నువ్వు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞుణ్ణి, నిన్నొక సాధనంగా వుపయోగించుకున్నానని బాధపడకు. చిన్నబుచ్చుకోకు, ఈ రాజ్యం కూడా అందుకొని సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపునబుట్టిన వాళ్ళం. ఆ తల్లిపాలు త్రాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించిన బ్రహ్మమార్గంలోనే ప్రయాణించాలని మేము కోరుకోవడంలో తప్పులేదు కదా ! సమర్ధులు వుండగా అయినవాడు అసమార్గం పడితే అది ఎవరి తప్పు అవుతుంది ? లోకం మమ్మల్నే కదా ఆడిపోసుకుంటుంది.

సుబాహువు ప్రసంగంతో కాశీరాజు కలత చెందిన మనస్సుతో సాధు పుంగవా! సుబాహూ! అలర్కుడికి ఉపకారం చెయ్యాలనుకున్నావు. మరి నాకు ఉపకారం చెయ్యాలని ఎందుకు అనుకోలేదు. సజ్జనులతో కలయిక నిష్ఫలంకావడానికి వీలులేదు. సత్ఫలాన్ని అందించు, అంచేత నీ కలయికవల్ల నాకు కూడా ఉన్నతిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో. 

కాశీపతీ ఇలా అడిగావంటేనే నీలో మార్పు తెలుస్తోంది. సంతోషం, ఆలకించు, ధర్మార్ధ కామమోక్షములని నాలుగు పురుషార్ధాలు వున్నాయి. వీటిలో మొదటి మూడింటినీ నీవు సాధించావు.

ఇప్పుడిక నాల్గవ దానికోసం ప్రయత్నించు. దాన్ని సాధించడం ఎలాగో క్లుప్తంగా చెప్తాను. సావధాన చిత్తంతో విను, విని బాగా ఆలోచించి శ్రేయస్సాధన కొరకు ప్రయత్నించు, మమ - అహమ్ అనేవి రెండూ దరిజేరకుండా చూసుకో. నేనెవడను? ఎవడి వాడను ? అని లోలోపల తర్కించుకో పరిపాలనా బాధ్యతలు అయ్యాక అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని తర్కించుకో. నీ ఆలోచల్ని అంతర్ముఖంగా ప్రయాణం చెయ్యనియ్య వ్యక్తావ్యక్తాలు తెలుసుకో అప్పుడు నేను ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆత్మ కానిదాన్ని ఆత్మగా భావించడమే అజ్ఞానం. అదే విమూఢత, దీన్ని తొలగించుకుంటే చాలు. రాజా నేను సర్వగతుడ్ని అయినా నువ్వు అడిగావు కాబట్టి లోక వ్యవహారాన్ని బట్టి సంక్షేపంగా సారాంశం తెలియజేసాను. సెలవు వస్తాను అంటూ సుబాహువు బయలుదేరాడు.

కాశీపతి ఒక్కనిమిషం అంటూ అన్నదమ్ములిద్దరికీ పాదాభిషేకం చేసాడు. ఇది మీ రాజ్యం మీ యిష్టం అని తన రాజధానికి బయలుదేరాడు.

No comments:

Post a Comment