Friday, 14 April 2023

శ్రీదత్త పురాణము (108)

 


ఇంతకన్నా నాకు సాధించవలసింది ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు శత్రువుకాదు. నేను నీకు శత్రువునీ కాదు. సుబాహువు కూడా అంతే అంతటా నేను ఆత్మనే దర్శిస్తున్నాను. అంచేత ఓరాజా నీకు యుద్ధం చెయ్యడానికి ఓ శత్రువు కావలసి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో. అలర్కుడి మాటలు వింటున్న కాశీపతి ముఖం వెలవెలబోతూ వుంటే సుబాహువు ముఖం మిలమిల మెరుస్తూ వుంది. అలర్కుడ్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు సుబాహువు. కాశీపతి దీనికోసమే - మా సోదరుడిలో ఈ మార్పు 

రావడం కోసమే - నేను నిన్ను శరణుకోరాను. నా కోరిక నెరవేరింది. నా పన్నాగం ఫలించింది. నేనింక బయలుదేరుతాను నీకు సుఖమగు గాక అని సుబాహువు అన్నాడు.


సుబాహూ అలర్కుడ్ని జయించి తాతతండ్రుల రాజ్యాన్ని అప్పగించమని కదా నీవు అడిగావు. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసికొని భోగాలు అనుభవించు. వెళ్లిపోతానంటావేమిటి ? అని అడిగాడు కాశీపతి.


అప్పుడు సుబాహువు ఇలా అన్నాడు. రాజా ఇంత ప్రయత్నమూ నేనెందుకు చేసానో నీతో చేయించానో నువ్వు గ్రహించు, నా తమ్ముడితడు, తుచ్ఛమైన రాజ్యభోగాలలో గ్రామ్య సుఖాలలో మునిగిపోయాడు. బ్రహ్మతత్వానికి దూరమవుతున్నాడు. ఇతడ్ని దారిలోకి తీసుకురావడం ఎలాగా అని నాకు దిగులుపట్టింది. మా కన్నతల్లి మదాలస బాల్యం నుండే నాకూ నాపై వాళ్ళిద్దరికీ బ్రహ్మతత్వాన్ని జోలలుగా పాడింది. స్తన్యంనోటితో, బోధ చెవులతో త్రాగించింది. మేము ముగ్గురం అమ్మదయవల్ల బ్రహ్మజ్ఞానులమై దుఃఖ రహిత పరమానందస్థితిని అనుభవిస్తున్నాం. కడగొట్టు తమ్ముడు వీడు. ఇతడు ఒక్కడూ ఇలా ఇంద్రియ సుఖాలకు దాసుడై ఎండమావులవెంట పరుగెత్తుతున్నాడు. చిన్న నాటనే అమ్మ వీడికి ఆబోధలు చెయ్యలేదే అనే దిగులుపడ్డాను. పదిమంది మంచివారు ఒకదారిలో వెళ్తూవుండగా ఒకడు మధ్యలో దారి తప్పితే ఎలాగుంటుంది. మిగిలిన వారికి బాధగా వుండదా ? అలాంటిది సొంత తమ్ముడు భోగబంధాలలో చిక్కుకొని చెడిపోతూ వుంటే నా మనస్సు విలవిలలాడదూ? ఉద్దరించాలి అనుకున్నాను. భోగాల నుండి విరక్తికలగాలంటే దుఃఖం వల్లనే కలుగుతుంది. మరి ఆ దుఃఖం విత్తనాశనం వల్లనే కలుగుతుంది. అంచేత ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేసాను.


No comments:

Post a Comment