Monday 17 April 2023

శ్రీదత్త పురాణము (111)



కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించటం చేతకాక ఈ లోకులంతా కోరికల వెంట పరుగులు తీస్తున్నారు. దుఃఖభాజనులు అవుతున్నారు. సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ, జ్యోతిస్వరూపమూ, సనాతనమూ, అయిన నీ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే నేను. అదే ఆత్మ. దత్తాత్రేయుడి దయవల్ల తల్లిదండ్రులు అనుగ్రహం వల్ల సోదరుడి కృషి వల్ల నేను కృతార్ధుణ్ని కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుణ్ని కాగలిగాను.


తండ్రీ, దత్తస్వామి అలర్కుడికి బోధించిన యోగవిద్య అంతా నీకు నేను తెలియచేశాను. దీన్ని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగమొక్కటే ఉత్తమమార్గం. యజ్ఞాలు, జపాలూ, తపాలు, ఇవన్నీ ఎందుకుగానీ యోగవిద్యను ఉపాసించు. జనకా దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు అడవులకు వెళ్ళి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వందుణ్నీ విష్పరిగ్రహుణ్నీ అయ్యి బ్రహ్మభావం పొందటానికి, ముక్తిని పొందటానికి నిర్వృతిని పొందటానికి ప్రయత్నిస్తాను.


తండ్రికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేసాడంటే కన్నకొడుకు తనను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలతో గుండెల్లో కమ్ముకున్న మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకొని కొడుకు చెప్పిన యోగవిద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆపైన మరికొంతకాలానికి నాల్గవదైన సన్యాసాశ్రమం స్వీకరించి యోగసిద్ధి పొందాడు.


నాయనా దీపకా! విన్నావు గదా ఇది దత్తమహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ. కార్తవీర్యుడి గాధ. ఆలర్కోపదేశం అన్నీ నీకు తెలిపాను. దత్త మహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా, విన్నా, వారికి దత్తుడి అనుగ్రహం వల్ల సమస్తకిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యాలు లభిస్తాయి. అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలికపడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి, ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యమూ, చైతన్యమూ ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురికుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది- అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మకలి పురుషునితో చెప్పాడు.

No comments:

Post a Comment