Friday 28 April 2023

శ్రీదత్త పురాణము (122)

 


ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు దేవగురువు. స్థిమితంగా సమాధానం ఇలా చెప్పాడు. ఇంద్రా ఇందులో వున్న తత్వరహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. సరే చెబుతాను విను. నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్వరహస్యాలే. తత్వోపదేశాలే. పారంపర్యంగా చివరికి తత్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని ఇవి కలిగిస్తాయి. ఈ విషయాల్ని తెలియచెప్పే ఏడు ఉదాహరణల్ని నీకు చెబుతాను శ్రద్ధగా విను. అంతా నీకే తెలుస్తుంది. అప్పుడు నీ అభిప్రాయం చెబుదువుగాని.

అనగనగా కాంపిల్య నగరం అనే పట్టణం వుండేది. ఆ నగరంలో నిధిజ్ఞుడు అనే శిల్పశాస్త్రపండితుడు వుండేవాడు. అతను శిల్పశాస్త్రంలోనే కాక వాస్తుజ్యోతిష్య శాస్త్రములతో కూడా విశేష ప్రతిభ కలిగినవాడు పైగా నీతిమంతుడు. మంచి, చెడు విచక్షణా జ్ఞానం కలవాడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా ఇతడినే పిలుస్తారు. దానితో ధనం బాగా సంపాదించాడు. ఇతడిని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానము లేదు. వాళ్ళు విధిజ్ఞుడుతో వుంటూ అతను చెప్పింది చేస్తూ వేతనాలతో బ్రతుకులు గడుపుతున్నారు. విధిజ్ఞుడు మాత్రం తనకున్న విద్యను ఉపయోగించి బాగా పుష్కలంగా ధనం సంపాదించాడు. ఆ ధనంతో దానధర్మాలు, శ్రాద్ధవిధులు, దేవతా పూజలు ఘనంగా జరిపించేవాడు. అందువల్ల రాజ్యంలో అందరికీ ఆప్తుడయ్యాడు. ఇష్టుడయ్యాడు. కీర్తిప్రతిష్టలు పెరిగాయి. అవి ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించాయి. దానితో పెద్ద పెద్ద ధనవంతులకూ, మంత్రులకూ, రాజవంశీకులందరుకూ తలలో నాలిక అయ్యాడు. ఇతర దేశాల రాజులు కూడ విదిజ్ఞుడ్ని పిలిపించి గౌరవించి భవనాలు, దేవాలయాలు, తటాకములు నిర్మింపజేసుకుని పుష్కలంగా బహుమతులు ఇచ్చి సాగనంపుతుండేవారు. ఆ ధనంతో విదిజ్ఞుడు ఇంకా ఇంకా దానధర్మాలు ఆచరించాడు. ఇలా వాస్తుశాస్త్రంతో, శిల్పాశాస్త్రంతో, జ్యోతిష్యంతో ధర్మబద్ధంగా ధనాన్ని కీర్తిని గడించి కొంతకాలానికి అతడు స్వర్గస్తుడయ్యాడు. దేవలోకంలో అతడు ఆచరించిన పుణ్యఫలాల ఫలితంగా చాలాకాలం స్వర్గసుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత కాంపిల్య నగరానికి రాజుగా జన్మించాడు. రాజధనంతో యజ్ఞయాగాదులు అసంఖ్యాకంగా చేసి ధర్మబద్ధమైన పాలనతో ప్రజలను రంజింపచేసి దేవాలయ ఆరామ కూప వాపీ తటాకాదులు ఎన్నెన్నో నిర్మింపచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. చేసిన పుణ్యాలకు ఫలంగా స్వర్గభోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో ఈసారి బ్రాహ్మణుడుగా జన్మించాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలు అభ్యసించాడు. గృహస్థాశ్రమంలో వేదాంతశీలుడై నిరంతర ధ్యాననిష్టతో గొప్ప గొప్ప వ్రతాలు, పూజలు చేసి చివరకు యోగవిధులకు వంద్యుడైన యోగి అయ్యాడు. వానప్రస్థం స్వీకరించాడు. పరిపక్వత సాధించాడు. చివరికి నాల్గవదైన సన్యాసాశ్రమం కూడా స్వీకరించాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడై చివరకు విదేహ కైవల్యం పొందాడు. ఇంద్రా విన్నావుగదా వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం ఆయా శాస్త్రాల ప్రావీణ్యం విధిజ్ఞుడికి క్రమంగా ముక్తికి సాధనమయ్యింది. మరొక ఉదాహరణ చెబుతామ అలకించు అన్నాడు బృహస్పతి.

No comments:

Post a Comment