Friday 7 April 2023

శ్రీదత్త పురాణము (102)

 


ఆచౌర్యం - బ్రహ్మచర్యం - త్యాగం - ఆలోభం- ఆహింస, అనేవి అయిదూ యోగి ఆచరించవలసిన వ్రతాలు. అక్రోధం - గురుశుశ్రూష - శౌచం - మితాహారం- నిత్యస్వాధ్యాయం అనేవి అయిదూ నిత్యం పాటించవలసిన నియమాలు.


లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు అనేకం వున్నాయి. వాటిని అన్నింటినీ కబళించి వెయ్యాలనే అత్యాశ పనికి రాదు యోగికి. సారవంతము, శక్తి సాధనమూ, ముక్తి సాధనము అయిన జ్ఞానాన్ని మాత్రమే ఉపాసించాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా అది తెమలదు. ప్రధానమైన యోగోపాసన సాగదు.


నిస్సంగుడై ఆరిషడ్వర్గాలను జయించినవాడై మితహారుడై జితేంద్రియుడై బుద్ధి ద్వారాలను అన్నింటినీ మూసి వేసి మనస్సు ధ్యానంలో నిమగ్నం చెయ్యాలి. శూన్య ప్రదేశాలలో, గుహలలో, వనాలలో, ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. సమాధి స్థితి కుదురుతుంది. వాగ్దన్డం, కర్మదండం, మనోదండం అనే మూడు దండాలను నియమంగా ధరించే యతిని 'త్రిదండి' అంటారు.


ఆలర్కా! జగత్తు అంతా ఆత్మమయంగా కనిపించే యోగికి ప్రియాప్రియాలు ఉంటాయా ? రాగద్వేషాలుంటాయా? మిత్రులనీ శత్రువులనీ ఉంటారా ? అతడి బుద్ధికి బంగారపు ముద్ద అయినా మట్టిగడ్డ అయినా ఒకటే. యోగీశ్వరుడు శాశ్వతము, అవ్యయము అయిన పరాత్పర స్థానం చేరుకొని పుట్టుకలేని స్థితిని పొందుతాడు. వేదాధ్యయనంవల్ల యజ్ఞక్రియా ప్రాప్తి, దానివల్ల జాప్యం, జాప్యం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ధ్యానం, ధ్యానం వల్ల నిస్సంగత్వం, దానివల్ల నిరతిశయం, నిత్యానందస్థితి లభిస్తాయి. సమాహిత చిత్తుడూ, బ్రహ్మమయుడు, ప్రసన్నుడు, రుచి, ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు, అయిన మహామతి యోగవిద్యను ఉపాసిస్తే విముక్తి పొందుతాడు అనడంలో ఏ సందేహమూ లేదు.


యోగ మార్గాన్ని ఎంచుకున్న వారు ఓంకారాన్ని ఉపాసించి తీరాలి. విష్ణు స్వరూపుడూ, విశ్వపాద శిరోగ్రీవుడూ, విశ్వేశుడూ, విశ్వభావనుడూ, అయిన ఆ పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించగలగాలి అంటే మహా పుణ్యప్రదమైన ఓంకారాన్ని జపించాలి. ఆ ప్రణవాక్షరస్వరూపం ఏమిటో వివరిస్తాను. అకార ఉకార మకారాల కలయిక ఇది. మూడూ మూడు మాత్రలు, అటు పైన యోగులకు మాత్రమే వుంది. అదే నిర్గుణమైనది. అదే అర్థమాత్ర, గాంధారస్వర సంశ్రయంతో ఇది గాంధారి అవుతుంది. యోగీశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఈ ప్రణవాన్ని జపిస్తే మూర్ధభాగంలో చీమ కదిలిన స్పర్శానుభూతి కలుగుతుంది. ఓంకారోపాసన చేసే యోగి ఓంకారమయుడు అవుతాడు. అక్షరుడవుతాడు. ఈ ప్రణవమే ధనస్సు, ఆత్మయే బాణం, లక్ష్యమేమో పరబ్రహ్మతత్వం.


No comments:

Post a Comment