Saturday 22 April 2023

శ్రీదత్త పురాణము (116)

 


కార్తవీర్య కృత దత్తస్తుతి


దేవాది దేవా! మహానుభావా! నువ్వు అనంతుడివి స్వయంప్రకాశకుడివి! నీలో స్వప్నతుల్యమైన ఈ జగత్తు మాయవల్ల వాస్తవంగా కనిపిస్తుంది. ఈ సృష్టి అంతా నీకు మనసా కల్పితం. ఒక్కటే చైతన్యం మాయాగుణం కారణంగా అనేక రూపాలతో భాసిస్తుంది. లేనిది ఉన్నట్లుగా అది అలా కనిపించటానికి ఆధారమైన నీకు ఇదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరమాత్ముడవైన నీకు జాగ్రత్, స్వప్న, సుషుప్త్యాది అవస్థలన్నీ మాయా కల్పితాలు. ఇది తెలుసుకున్న జ్ఞానులు (అనుమాణ ప్రమాణం) గురూపదేశం అనే రెండంచుల జ్ఞానఖడ్గంతో హృదయంలోని అహంకార గ్రంధిని ఛేదించుకుని అఖిలగురుడవైన నిన్ను శరణు శరణు అంటున్నారు. విశ్వేశా! శరణన్నవారి భవరోగ దుఃఖాలను తొలగించి జ్ఞానకాంతుల్ని వెలిగించి ముక్తుల్ని చేసే గురుత్తముడవి నీవు, త్రిగుణమాయానియామకుడవు గోవిందా, అచ్యుతా, ఆజా, సదేశా, నీకేదే నా కోటి నమస్కారములు. నీవు నిత్య ముక్తుడవు పరిశుద్ధుడవు. విబుద్ధుడవు, ఈశుడవు, సర్వదేవ రక్షకుడవు అనన్య సిద్ధుడవు అటువంటి నిన్ను దేహేంద్రియాది స్వరూపుణ్ని నేను ఇదే శరణు కోరుతున్నాను.


సచ్చిదానందా పురాణ పురుషా, నారాయణా - జగత్కారణకారణా పురుషోత్తమా ఈ సంసారబిలంలో పడ్డాను నేను. ఇక్కడ ఏదో గొప్ప సుఖం ఉంది. అనుభవిద్దామని సంబరపడుతూ వచ్చిపడ్డాను. కాలం నన్ను కాటు వేసింది. ఇప్పుడు అలమటిస్తున్నాను. దయాళూ నిర్వాణానుభవ మహానందాన్ని అందించే నీ బోధామృత వాగ్బిందువుల్ని నా మీద జల్లి నా ఆర్తిని దుఃఖాన్ని తొలగించు. మాయామయుడవై ఈ విశ్వాన్ని సృష్టిస్తావు పోషిస్తావు లయిస్తావు. అంతా నీ ఇచ్ఛాశక్తితోనే జరుగుతుంది. దాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు అంటే మానవమాత్రులం మేము తెలుసుకోగలమా? భావపరంపర యాత్రలో చిక్కుకుని జనన మరణాల కోరల్లో నలిగిపోతూ తాపత్రయాలలో మాడిపోతూ పరితపిస్తున్న నాకు-స్వామి-నీపాద పద్మాలే దిక్కు- నీ వాక్కే ఉపశమనం మరొక దిక్కులేదు. విశ్వరూపా మహామునులకు కూడా అందని భక్తియోగాన్ని వైరాగ్యాన్ని విశుద్ధ విమల విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అఖిల దుఃఖాలకు మూలబీజం అహంకారం, మమకారం. వీటిని తొలగించు వైకుంఠధామా! నువ్వు దత్తాత్రేయుడుగా అవతారం ధరించింది యోగప్రచారానికే జ్ఞానప్రసారానికే అంటారే మరినువ్వే కరుణించకపోతే ఇక నాబోటి వారికి దిక్కెవరు తండ్రీ.


అన్ని అనర్ధాలకు నిలయం ఈ శరీరం. ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుల్ని ఉద్దరించటం కోసం నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటావట. సత్వగుణంతో దేవతల్ని రజోగుణంతో పాలకుల్ని తమోగుణంతో భూతాదుల్ని కల్పించి గుణాలన్నింటికి నువ్వే నియతంగా నిలబడి తర్వాత నువ్వే అతీతంగా నిలుస్తావట. ఆదిపురుషా! జగదీశా! నిన్ను తెలుసుకోవటం నాబోటి మందబుద్ధులకు సాధ్యమా? సక్రమంగా నిన్ను సేవిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తావట. నిష్కామంగా నీ పాదుకలు నిత్యం పూజిస్తే చాలు అనశ్వరమైన బ్రహ్మపదాన్నే అనుగ్రహిస్తావట.


No comments:

Post a Comment