Saturday, 8 April 2023

శ్రీదత్త పురాణము (102)

 


ఓంకారమే త్రిమూర్తులు. ఓంకారమే త్రిలోకాలు, మూడు అగ్నులు, త్రివిక్రమ పదాలు. మూడు గుణాలు, ఋగ్యజుస్సామాలు, ఇదే. దీనిలో 'అ' కారం భూర్లోకం - 'ఉ'కారం భువర్లోకం - 'మ'కారం స్వర్లోకం. అలాగే 'అ'కారం - వ్యక్తం 'ఉ'కారం అవ్యక్తం - 'మ'కారం చిచ్ఛక్తి, పై నున్న కొసరు, అర్థమాత్ర - ఇదే పరమపదం - 'అ'కారం - హ్రస్వం - 'ఉ'కారం - దీర్ఘం - 'మ'కారం - ప్లుతం పైనున్న అర్థమాత్ర వాగతీతం. ఇంతటి శక్తివంతమైన 'ఓం'కారాన్ని పరబ్రహ్మగా గుర్తించి ఉపాశించిన యోగి సంసార చక్రాన్ని వదలి బంధన త్రయాన్ని ఛేదించుకొని పరబ్రహ్మతత్వంలో లీనమవుతున్నాడు. కర్మబంధనాలు తెంచుకోలేక ఆపశకునాలతో మృత్యువు నెరిగి ప్రాణం వెళ్ళే సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించిన భ్రష్టయోగి తిరిగి యోగిగా పునర్జన్మ పొందుతాడు. కనుక సిద్ధ యోగులు గాని అసిద్ధ యోగులు కానీ చివరి కాలాన్ని సూచించే అపశకునాలను (అరిష్టాలు) తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసానదశను గుర్తించలేక దెబ్బతింటారు.  

అరిష్ట సూచనలు


కాబట్టి, అలర్కా ! యోగికి మరణ సూచకాలైన అరిష్టాలు (అపశకునాలు) ఏమిటో తెలియజేస్తున్నాను గ్రహించు. దేవమార్గం (భ్రూమధ్యం), ధ్రువం (నాసికాగ్రం), శుక్రం (రేతస్సు క్షీణించడం), సోమచ్చాయ (జిహ్వాగ్రం), అరుందతి (ఘటిక)- వీటిని చూడలేనివాడు సంవత్సరకాలంలో గతిస్తాడని తెలుసుకో.


(దేవమార్గమంటే కృష్ణ పక్షంలో ఆకాశాన కనిపించే గంగాప్రవాహ సదృశ దృశ్యమనీ, ధ్రువనక్షత్రం- శుక్ర గ్రహం - అరుంధతీ (సప్తర్షి మండలంలో) నక్షత్రం అనీ, సోమచ్ఛాయ అంటే చంద్రబింబంలో కనిపించే మచ్చ అనీ మరొక వ్యాఖ్య ఉంది). కిరణాలు లేని సూర్యబింబాన్ని కిరణాలున్న అగ్నినీ చూసినవాడు పదకొండు నెలల్లో మరణిస్తాడు. కలలోగానీ మెలుకవతోగానీ వెండిబంగారు రంగుల్లో మూత్ర పురీషాల్ని వదిలినవాడు పదినెలలకు వెళ్ళిపోతాడు. ప్రేతపిశాచాది గంధర్వ నగరాలనూ (ఆకాశంలో కనిపించే నగరాకార దృశ్యం = గంధర్వనగరం) బంగారు చెట్లనూ కలలోగానీ (ప్రత్యక్షంగా గానీ) దర్శించినవాడు తొమ్మిది నెలల్లో అసువులు వదులుతాడు. స్థూలదేహంవాడు హఠాత్తుగా చిక్కిపోవడం, సన్నటి మనిషి ఒక్కసారిగా లావెక్కడం- ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అతడు ఎనిమిది నెలలకన్నా బ్రతకడు. బురదలో గానీ, దుమ్ములోగానీ కూరుకుపోయిన తన పాదం తన చూపులకే ముక్క విరిగినట్టు కనిపిస్తే అతడు ఏడు నెలల్లో దివంగతుడవుతాడు. గ్రద్ద - పావురం - కాకి - జెముడు కాకి - మాంసం తింటున్న నల్లని పక్షి - ఇవి ఏవైనా తలమీద వాలితే వాడు ఆరు నెలలకి మించి జీవించడు. కాకులు అకారణంగా నెత్తిమీద తన్నితే వాడు అయిదునెలలకూ, తన నీడ తనకే తలకిందులుగానో, మరో రూపంగానో కనపబడితే వాడు నాలుగు నెలలకూ, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనిపించినవాడు మూడు నెలలకూ, నెయ్యి నూనె నీరు అద్దాలలో తలలేని తన మొండెం కనిపించినవాడు ఒక్కనెలకూ, శరీరం గొర్రె వాసనగానీ, పీనుగు కంపుగానీ కొడితే వాడు పదిహేను రోజులకూ, స్నానం చేసిన వెంటనే హృత్పద్మమూ కాళ్ళు ఎండిపోవడం మంచినీళ్ళు ఎన్ని తాగినా ఇంకా దాహమవ్వడం ఇలాంటివి జరిగినవాడు పదిరోజులకీ, గాలి తగిలితే చాలు మర్మస్థానంలో మంటబుట్టేవాడూ వెన్నెల హాయిగొల్పనివాడూ నాలుగయిదు రోజులకు మరణిస్తాడని గ్రహించు.


No comments:

Post a Comment