Sunday 16 April 2023

శ్రీదత్త పురాణము (110)

 


సుమతీ ఆ తర్వాత ఏమయ్యింది ? నిరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు ? సుబాహువు మరి తన తమ్ముడ్ని ప్రశంసించలేదా ? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాత కధను సుమతి ఇలా వివరించాడు. అది కూడా నీకు చెబుతాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్కకథను ఇలా చెప్తున్నాడు.


కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహువుకు పాదాభివందనం చేసాడు. అన్నా నన్ను కృతార్ఖుడ్ని చేసావు. కృతజ్ఞుణ్ని చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికీ బ్రహ్మజ్ఞానం నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుడ్ని అయ్యాను. నీ దయవల్ల ఇప్పటికి విముక్తుడ్ని కాగలిగాను అని ఆనందభాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి అర్ధంగా కౌగలించుకున్నాడు. సుబాహువు, తమ్ముడూ! నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది. ఏది చెయ్యాలో అది చేసావు. కాబట్టి ఇంక నీ యిష్టం. రాజ్యమే ఏలుకుంటావో, అడవులకే వెడతావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది. ఏదీ లేదు. అంతా దత్తాత్రేయుడి అనుగ్రహం. శుభమగుగాక అని ఆశీర్వదించి సుబాహువు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు.


అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకి రాజ్యపట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్నీ సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంత కాలానికి నిర్ద్వంద్వుడూ, నిష్పరిగ్రహుడూ అయి యోగసిద్ధిని పొందాడు. నిర్వాణ ఫలాన్ని చవిచూసాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తు అంతా తిలకించాడు. దేవ, అసుర, మానవగణాలతో పశుపక్ష్యాది జాతులతో అనేక రకములై వృక్షసంపదలతో కిటకిటలాడుతున్న జగత్తు సత్వ, రజస్తమో గుణాలనే బంధాలలోబడి కొట్టుమిట్టాడుతున్న వైనం కనిపించింది. బిడ్డలనీ, తోబుట్టులనీ, మిత్రులనీ, శత్రవులనీ, తనవారనీ, పరాయివారనీ ఏవేవో బంధాలు - సంబంధాలు కల్పించుకుంటూ తన్నులాడుకుంటున్నారు. కామక్రోదాదులకులోనై దుఃఖారులవుతున్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడిదొర్లుతున్నారు. ఉద్ధరించే దిక్కు లేక అల్లల్లాడుతున్నారు. తానొక్కడూ గట్టు మీద నిలబడి చూస్తునట్లు దర్శనం అయ్యింది. అప్పుడు అతని నోటి నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు.


ఓహో! ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణానుభవంతో పోలిస్తే అవి ఏ పాటి? యోగాన్ని మించిన పరమ సుఖం లేదు గాక లేదు. కాంతాకనకాలు వస్తు వాహనాలు - ధనధాన్యాలూ - లోకంలో ఏ ఐశ్వర్యమైనా, అది అందించే ఆనందమైనా యోగం అందించే ఆనందంలో పదహారవవంతు కూడా లోకంలోని ఏ కాదు.

No comments:

Post a Comment