Sunday 9 April 2023

శ్రీదత్త పురాణము (103)

 


ఎలుగుబంటిని గానీ, కోతిని గానీ ఎక్కి, పాడుతూ దక్షిణ దిక్కుకి పోతున్నట్టు కలగన్న వాడికి మృత్యువు సమీపించిందని అర్ధం. ఎర్రని చీర లేదా నల్లని చీర ధరించిన ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని పాడుతూ విరగబడి నవ్వుతూ తనను దక్షిణ దిశకు లాక్కుపోతున్నట్టు కలవస్తే వాడు కూడా ఆసన్నమృత్యువే. దిగంబరుడు నిలబడి పగలబడి నవ్వుతున్న క్షపణకుడు స్వప్నంలో కనిపిస్తే అది కూడా ఆసన్నమృతినే సూచిస్తుంది. బురదగుంటలో గానీ మలమూత్రరూపంలో గానీ తలమునిగేలా కూరుకుపోతున్నట్టు కలగన్నవాడు అట్టేరోజులు బ్రతుకడు, అలాగే భీకర వికృతాకారులై నల్లని పురుషులు ఆయుధాలు ధరించి వచ్చి రాళ్ళతో తనని బాదుతున్నట్టు కలగన్నవాడు కూడా అట్టే రోజులు ఉండడు.


సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊళపెడుతూ ఎదురువచ్చి తనకు అపసవ్యంగా వెళ్ళినా, అన్నం కడుపునిండా తిన్నా వెంటనే మళ్ళీ ఆకలి అవుతున్నా, పంటిలో కురుపు (వ్రణదంతః) లేచినా, దీప నిర్వాణ గంధాన్ని, అన్న గంధాన్ని గుర్తించలేకపోయినా (దీపాన్ని గంధంనోవెత్తి), రాత్రిపూట ధూమవహ్ని కంటి చూపులకి తెలియకపోయినా (ధూమువహ్నిం తథావిశ), ఎదుటవారి కనుగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా ( నాత్మానం పరనేత్రస్థం వీక్షతేన సజీవతి) అర్థరాత్రి హరివిల్లు పట్టపగలు నక్షత్రాలూ కనిపించినా ఇవి సద్యోరిష్ట సూచకాలని గ్రహించు. వెంటనే మృత్యువు సంభవిస్తుంది. ఉన్నట్టుండి నిష్కారణంగా ముక్కు వంకర తిరిగినా, చెవులు ఎగుడు దిగుడులైనా, ఎడమ కన్ను ఉత్తినే నీరు కారుతున్నా, ముఖం ఎర్ర బారడం నాలుక నల్లబారడం జరిగినా ఆయుర్దాయం క్షీణించిందని తెలుసుకోవాలి. ఒంటెలుగానీ, గాడిదలు గానీ పూన్చిన బండిమీద దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు కలగన్నవాడికి సద్యోమృత్యువని తెలుసుకో. చెవులు రెండు మూసుకున్నప్పుడు లోపలి ఘోష వినబడకపోయినా కళ్ళతో కాంతి తరిగిపోయినా అతడూ అట్టేనాళ్ళు జీవించడు. గుంటలో తాను పడినట్టు దానిమీద ఎవరో ఏదో వేసినట్టు తాను పైకిలేచి రాలేకపోతున్నట్టు కలగన్నవాడి పని అయిపోయినట్టే. మిడిగుడ్లుపడి రెప్పవాలకపోయినా కనుగుడ్లు ఎరుపెక్కి ఆప్రయత్నంగా గిరగిర తిరుగుతున్నా అకారణంగా ముఖం ఆవిరులు కక్కుతున్నా నాభి ప్రదేశం చల్లబడినా (సుసీదా చనాభి:- శశిరచనాభి:) అతడికది చరమసమయమని తెలుసుకో, తాను నిప్పుల్లోను, నీళ్ళల్లోను పడ్డట్టూ లేచి రాలేకపోతునట్టు కలగన్నవాడికి అదే తుదిఘడియ, కోపించి భూతపిశాచాలు రేయింబవళ్ళు తనను చితకబాదుతున్నట్టు ఎవడికి అనిపిస్తుందో వాడు వారం తిరక్కుండా సెలవుపుచ్చుకుంటాడని గ్రహించు. నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ధరించినా అది ధరించినవాడి కంటికే ఎర్రగానో నల్లగానో కనిపిస్తే వాడు కొన్ని గంటల్లో హరీ అంటాడని చెప్పి వెయ్యవచ్చు. ఆకారణంగా స్వభావంలో మార్పుగానీ, ప్రకృతి విపర్యయంగానీ అరిష్ట సూచకాలు. వినయ విధేయతలతో తానింతవరకూ పూజించిన తల్లితండ్రుల్నీ, గురువుల్నీ, అత్తమామల్నీ జ్ఞానుల్నీ, విప్రుల్నీ, యోగుల్నీ అవమానించాలనే బుద్ధి తనకే పుడితే వాడు ఆసనమృత్యువే.


No comments:

Post a Comment