Monday 10 April 2023

శ్రీదత్త పురాణము (104)

 


అలర్కనృపతీ ! యోగులకు మరణ సూచకాలైన అరిష్టాలు ఇవ్వి. వీటివల్ల కనీసం ఒక సంవత్సరం ముందుగా మరణసమయాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకొని యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేస్తే ఫలం దక్కుతుంది. ఒక్కొక్క సారి యోగమధ్యంలో మరణం తప్పిపోవచ్చుకూడా. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృతిని తెలుపుతాయి కనుక యోగి మరణభయాన్ని జయించి దానికోసం సన్నద్ధుడై ఎదురుచూడగలగాలి. అప్పటి వరకూ ధృడచిత్తంతో రేయింబవళ్ళు యోగసాధనను కొనసాగించాలి. ఎక్కడ ఎప్పుడు అరిష్ట సూచన లభిస్తుందో అక్కడే అప్పుడే యోగసాధనను గాఢం చేసుకోవాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలను అణచుకొని పరమాత్మలో మనస్సును లీనం చెయ్యాలి. ఆత్మపరంగా తన్మయుడై చిద్పత్తిని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము అగోచరము అబోధ్యమూ అనాఖ్యేయమూ అయిన పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందుతాడు, అనుభవిస్తాడు.


సుమతి తన తండ్రితో చెప్పిన కథను వేదధర్ముడు దీపకుడికి చెబుతున్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగీంద్రుడు అలర్కుడిపట్ల కరుణగలవాడై యోగ విద్యామహిమలను ఇంకా వివరించాడు.


అలర్క నరేంద్రా ! చంద్రకాంతమణి వెన్నెల సోకితేనే స్రవిస్తుంది. సూర్యకాంతమణి ఎండతాకితేనే నిప్పులు కక్కుతుంది. ఇవి రెండూ యోగికి ఉపమానాలు. యోగికి యోగం వల్లనే ముక్తి. మధ్యలో తపస్సనీ ఇంకొకటనీ దారులు మారకూడదు. చీమలు, ఎలుకలు, ముంగిసలు, బల్లులు కపింజలాలు (కముజులు) మొదలైనవి గృహస్తుల ఇళ్ళల్లో యజమానులతో సరిసమానంగా నివసిస్తుంటాయి. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణంగా యజమానుడి ఇల్లు ధ్వంసమైపోతే ఇవి ఏమీ దుఃఖించవు. హాయిగా మరొక ఇల్లు చూసుకుంటాయి. అలాగే యోగి కూడా తన శరీరంలో తానుంటూ ఎప్పుడైనా దానికి హాని సంభవిస్తే నిర్విచారంగా మరో ఉపాధికి మారగలగాలి. యోగం సిద్ధించేవరకు ఇదే వరస. ఎప్పటికి ఇది సిద్ధించేను ? అసలు సిద్ధించేనా అని బెంబేలు పడకూడదు. చెదపురుగు యోగికి చక్కని ఆదర్శం. అది ఎంత అల్పజీవి. అయితేనేమి ఆ చిన్ని ముట్టితో మట్టికణాల్ని తొలచి ఎంతెంత పుట్టలు పెడుతుందో చూసే ఉంటావుగదా ! యోగికూడా ఈ మృద్దేహికలాగానే పరిశ్రమించి క్రమక్రమంగా యోగసిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనేపాటి అనుకోకూడదు.


No comments:

Post a Comment