Thursday, 13 April 2023

శ్రీదత్త పురాణము (107)

 


మూఢులై అజ్ఞానతిమిరంతో కొట్టుమిట్టాడే జనులకు జ్ఞాన చక్షువును అందించే యోగభాస్కరా, బ్రహ్మవంశ సంభవా, మునీశ్వరా, మౌనశాలి, అనసూయా తనయ, మునిసుత, నమోస్తుతే నమోస్తుతే! స్వేచ్ఛా విహారి ! వర్ణాశ్రమ వివర్జిత ! నిజానికి నీకు ఏ రూపం లేకపోయిన బ్రాహ్మణ రూపం ధరించి కనిపించేవాడా! యోగీ ! వేద బ్రాహ్మణ రక్షక ! కైటభమర్ధనా! వైకుంఠ! వైకుంఠానికి ఈ విశ్వానికి బెడదతెచ్చే వ్యక్తులను, శక్తులను నాశనం చేసేవాడా! మురారాతి ! కేశినిఘాదనా ! కంస విధ్వంసి ! కృష్ణా ! పదేపదే నీకు శిరసువంచి అంజలి ఘటిస్తున్నాను. దేవదేవ జగత్పతి ! నీ అనుగ్రహంవల్ల కృతార్థుణ్ణి అయ్యాను, నువ్వు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను, అని ఆనందాతిశయంతో బొంగురుపోతున్న గొంతుతో, ఒణికిపోతున్న శరీరంతో సాష్టాంగపడి ఆనందభాష్పాలతో దత్తదేవుని పాద పద్మాలు కడిగి ఆలర్క మహారాజు స్వామి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు.


సహ్యాద్రి నుండి అలర్కుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువూ కాశీపతి కొలువు తీరియున్నారు. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు. రాజ్యకాముక కాశీపతీ అనుభవించు మహోర్జితమైన ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధారపోస్తున్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు. లేదా సుబాహుకి అప్పగించుకో. నీ యిష్టం ఎలా కావాలంటే అలా చేసుకో, ఇదిగో తీసికో, హఠాత్తుగా అలర్కుడు ఊడిపడటం నుంచి తేరుకోని కాశీరాజు ఈ మాటలకు మరీ నివ్వెరపోయాడు, ఏమిటి ఆలర్కా ! నీవు అంటున్నది ? రాజ్యాన్ని వదిలేస్తున్నావా ? యుద్ధం మానుకున్నావా ? ఇది క్షత్రియధర్మమేనా ? నువ్వు అసలు సిసలు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మాలన్నీ ఎరిగినవాడివి ఏమిటి ఈ వింత ? రాజ్యాన్ని నాకు ధారపోయడం ఏమిటి ? అమాత్యులు, సామంతులు, సేనాపతులు, అందరూ ఓడినా క్షత్రియుడన్నవాడు మరణ భయాన్ని దగ్గరికి రానీయకుండా శత్రువు మీదకు బాణాలను గురిపెడుతూ రణరంగంలో నిలబడాలే గానీ ఇదేమిటి ? ఈ రాజ్య త్యాగం నాకేమీ అర్ధంకావడం లేదు. చాలా వింతగా వుంది. యుద్ధాలు చెయ్యాలి. శత్రువులను జయించాలి. రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి. సరలోక సుఖాలకోసం మహాయజ్ఞాలు చెయ్యాలి. ఇది మన ధర్మం.

కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడబోయాడు. అలర్కుడు అడ్డు తగిలాడు. కాశీనరేశా ఒకొప్పుడు నీలాగే నాకు. ఇలాంటి ఆలోచనే వుండేది, ప్రస్తుతం నా పరిస్థితి వేరు. ఆలోచనలన్నీ మారిపోయాయి. కారణం చెబుతాను విను, గడ్డిపరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతీ ప్రాణీ అలాగే పెరుగుతుంది. అన్నింటిలో వుండే చితశక్తి ఒక్కటే అదే ఆత్మ అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజు ఏమిటి, పేద ఏమిటి శత్రువేమిటి ? మిత్రువు ఏమిటి ? ఇన్ని భేదాలు. ఎక్కడవున్నాయి? అంతటా వున్నది నేనే. వేరేవరితో యుద్ధం చెయ్యాలి ? కాశీరాజా దత్తస్వామి నాకు ఈ జ్ఞానం ఉపదేశించారు. కనువిప్పు కలిగించారు. ఇంద్రియాలను జయించి సర్వసంగపరిత్యాగినై మనస్సును పరబ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైన జయమంటే ఇదే. పరమజయం ఇది.

No comments:

Post a Comment