Tuesday, 25 April 2023

శ్రీదత్త పురాణము (119)

 


దేవా! మహాదేవా! యోగవిద్యా గురూ! ఆధ్యాత్మదర్శనా! అత్రివంశ ప్రకాశకా! జయము జయము - అని స్తుతించి తిరిగి తిరిగి నమస్కరిస్తూ అందరూ వచ్చినట్లే ఆకాశమార్గంలో తిరిగిపోయారు. ఆ వెంటనే సహ్యాద్రి ప్రాంతంలో ఆశ్రమాలలో నివాసం వుంటున్న వానప్రస్థులూ, సన్యాసులూ, వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు ఎవరికి వారు. వచ్చి దత్తాత్రేయుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి వేదమంత్రాలతో, శ్లోకాలతో స్తుతించి వెళ్ళిపోయారు.


తూర్పు దిక్కున ఎరుపురేకలు కనిపించాయి. కాసేపటికి అవి తెల్లదనం సంతరించుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుడు ధ్యాననిష్టను క్రమక్రమంగా సడలించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. పద్మాసనం నుండి లేచాడు. నైఋతి దిక్కుగా నడిచాడు. శాంతతపుడు అనే శిష్యుడు అందించిన మట్టితో నీళ్ళతో కాలకృత్యాలు తీర్చుకున్నాడు. తిరిగి వచ్చాడు. సత్యవాక్కు అనే ముని అందించిన గోమయి - మృత్ - కుశ - భస్మవల్కలాలను తీసికొని వెంటరాగా దత్తస్వామి అక్కడికి చేరువలోనే నదీతీరానికి వెళ్ళి నియమపూర్వకంగా స్నానం చేశాడు. దేవ పితృఋషి తర్పణాలు వదిలిపెట్టాడు. ఉదయిస్తున్న సూర్యభగవానున్ని విధి విధానంలో ఉపాసించాడు. అహ్నికాలు నిర్వర్తించాడు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. కోల్హాపుర లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి భిక్ష స్వీకరించి క్షణకాలంలో మళ్ళీ సహ్యాద్రి పర్వత ఆశ్రమానికి చేరుకున్నాడు. పర్ణశాల ముందు ఎప్పటిలాగే గున్నమావి చెట్టు నీడలో మట్టితిన్నెపై కూర్చున్నాడు.


చుట్టుప్రక్కల ఆశ్రమాల నుండి మునులూ యోగులు వివిధ ఆశ్రమాలవారు వచ్చి దత్తస్వామికి నమస్కరించి తిన్నె చుట్టూ అర్ధచంద్ర వలయాకారంలో కూర్చున్నారు. నోరువిప్పి ఏది పలికితే అది విని తరిద్దామని ఆశగా ఎదురుచూస్తున్నారు. అల్లంత దూరాన కార్తవీర్యార్జునుడు నిలబడి వున్నాడు. శిరస్సుపై రెండు చేతులు వుంచి అంజలి ఘటిస్తూ స్వామివైపు చూస్తున్నాడు. అతడిని ఏదో భయం ఆవరించింది. చిన్నగా వణుకుతున్నాడు. ఇది గమనించిన శాంతతపుడు అనే శిష్యుడు దత్తస్వామికి నివేదించాడు. దత్తస్వామి కార్తవీర్యార్జునుని వైపు ప్రసన్నంగా దృష్టి సారించి చిరునవ్వులు చిందిస్తూ నాయనా కార్తవీర్యా! ఎందుకు భయం? ఎందుకు ఆ వణుకు? ఎందుకు దుఃఖం? ఇలారా దగ్గరగా కూర్చో నీ దుఃఖమూ భయమూ భిన్నతా అన్నీ తొలగిపోతాయి. నువ్వు కోరుకుంటున్న చిత్తశాంతి లభిస్తుంది. రా ఇలా రా అని ఆప్యాయంగా పిలిచాడు. కార్తవీర్యుడుకి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా కన్నులు వరదలు కట్టాయి. తల్లి పిలుస్తుంటే ఒడిలోకి పరుగుతీస్తున్న పిల్లవాడిలాగా దగ్గరకు చేరి సాష్టాంగపడి దగ్గరగా మౌనంగా కూర్చున్నాడు. దత్తస్వామి అతడి ఆర్తినీ ఆవేదననూ గుర్తించాడు. నాయనా భయపడకు. దిగులు చెందకు నీకేమికావాలో అడుగు చెబుతాను. నీ అజ్ఞానం తొలగిస్తాను. దుఃఖం పోగొడ్తాను. నువ్వు నాకు పరమభక్తుడివి. అనన్య సేవలు చేసిన వాడివి. నాకు ఆప్తుడవి. నువ్వు కోరితే చెప్పరానిదంటూ ఏదీ లేదు. ఏది అడుగదలచుకొన్నావో అడుగు సమాధానం చెబుతాను. సంశయాలు తీరుస్తాను. గురువు అంటేనే ఇదికదా! సందేహించక అడుగు. దత్తస్వామి ఇలా ప్రేమగా చనువిచ్చి ప్రోత్సహించేసరికి కార్తవీర్యార్జునుడు తేరుకొని ఇలా అడిగాడు.


No comments:

Post a Comment