Tuesday 11 April 2023

శ్రీదత్త పురాణము (105)

 


ఆవుదూడ కొమ్ము చూడు తొలి నాళ్ళలో చిన్న బొట్టంత (తిలకాకృతి) ఉంటుంది. దూడతోపాటు ఎదుగుతూ ఎంతెంత కొమ్ములవుతాయో, యోగి కూడా ఇలాగే తన యోగాభ్యాసంలో ఆత్మాకాశవృత్తిని క్రమంగా వృద్ధి పొందించుకోవాలి. ధృడపరుచుకోవాలి. పశుపక్షి మనుష్యాదులు తన ఆకుల్నీ కొమ్మల్ని బెరడుల్నీ కాజేస్తున్నా వృక్షం ఎలాగైతే తన ఎదుగుదలను కొసాగించి ఫలిస్తుందో అలాగే యోగికూడా తనదేహానికి కలిగే పీడనల్ని లెక్కచెయ్యకుండా సిద్ధిపర్యంతం యోగాభ్యాసాన్ని కొనసాగించాలి. నిండుగా నీటికుండను తలపై పెట్టుకొని దారిని చూసుకుంటూ ఎత్తులకు ఎక్కేవారిని చూడు. యోగి కూడా ఇలాగే ఏకాగ్ర చిత్తంతో ధారణతో ఉన్నత స్థితికి చేరుకోవాలి. అంతేగానీ కేవలం ప్రాణాయామంతో ఒరిగేది ఏమీలేదని గ్రహించు. రాత్రి గడిచి తెల్లవారుతున్న తరుణంలో సకలప్రాణి కోటికీ చలన చేష్టాది చైతన్యం కలుగుతోంది. దీని తత్త్వం ఆకళించుకొని యోగి తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. అలర్కనరేంద్రా ! ఒక్కమాట చెబుతాను సారాంశంగా గుర్తుంచుకో, యోగియైనవాడు అన్ని విషయాలలోను నిర్మమంగా ఉండాలి. తానెక్కడ ఉంటే అదే గృహంగా, ఏది తింటే అదే భోజ్యంగా (ఉన్నదే ఇల్లుగా తిన్నదే తిండిగా) ఏది ఉంటే అదే ధనంగా సంబరపడాలి.


గృహస్థుడు ఆయా పనుల్ని భృత్యులతో పుత్రులతో (కరణములు) చేయించుకుంటాడు. అలాగే యోగికూడా తన బుద్ధ్యాదుల్ని కరణాలుగా (సాధనాలుగా) వినియోగించుకొని పరాన్ని సాధించుకోవాలి. ఏనాడూ ఏమరకూడదు. రాజా ! యోగవిద్యా రహస్యాలు చాలా చెప్పాను. కనువిప్పు కలిగిందా ? ఇవి నీ బుద్ధిలోకి ఇమిడాయా ?


అలర్కుడు వినయ వినమిత శిరస్కుడై - మహానుభావా ! ఎంత అదృష్టవంతుణ్ణి, సాక్షాత్తు యోగవిద్యాస్వరూపుడి నున్చి యోగవిద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి ఇలా నోచుకున్న నా జన్మ ధన్యం. ఇంతకీ కారణం - నాకు జరిగిన అవమానం. నాకు వచ్చిపడ్డ అపజయం. నన్నావరించిన ప్రాణాపాయభయం. కాశీ నరేశ్వరుడి సేవా బలపరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చి పడవేశాయి. అదృష్టవశాత్తు నాకు అంతటి సైన్యబలం లేకపోయింది. అదృష్టవశాత్తు నా భృత్యులంతా హతులయ్యారు. అదృష్టవశాత్తు నా కోశం తరిగిపోయింది. అదృష్టవశాత్తు నాలో నీతి మేల్కొంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా నేనీపాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాణ్ని. నా అదృష్టం బాగుండి ఇలా జరిగింది. సరిగ్గా తగిన సమయానికి నీ పాదయుగళం గుర్తుకి వచ్చింది. నువ్వు అనుగ్రహించావు. అదృష్టం బాగుండి నీ ప్రతిమాటా నా హృదయంలోకి ఇంకింది. నీ సాంగత్యం వల్ల నాకు జ్ఞానోదయమయ్యింది. అదృష్టం బాగుండి నువ్వు నామీద దయతలచావు. కలిసివచ్చే కాలానికి అపకారం (అనార్యం) కూడా ఉపకారమవుతుందంటే ఇదేననుకొంటాను. నాకు కలిగిన పరాజయదుఃఖం నీ సంగమం వల్ల ఇంతటి మహోపకరంగా పరిణమించింది.


No comments:

Post a Comment